New York City: దట్టమైన పోగలతో నిండిపోయిన న్యూయార్క్.. గాలి నాణ్యతపై ప్రభావం
ఈ వార్తాకథనం ఏంటి
న్యూయార్క్ నగరంపై కార్చిచ్చు పొగలు అలముకున్నాయి. శనివారం లాంగ్ ఐలాండ్‌లోని హోంప్టన్స్‌లో ఈ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.
అయితే తీవ్రమైన గాలులు వీచడంతో దట్టమైన పొగ ఆకాశమంతా వ్యాపించింది. ఈ కారణంగా కొన్ని ప్రధాన రహదారులను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
హోంప్టన్స్‌లో నాలుగు ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం 1 గంటకల్లా మోరిచెస్, ఈస్ట్‌పోర్టు, వెస్ట్ హోంప్టన్స్ తదితర ప్రాంతాలకు ఈ అగ్ని వ్యాపించింది.
ఈ ప్రమాదంతో ఆ ప్రాంతం పొగతో నిండిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాల వల్ల మూడు చోట్ల మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురాగా, హోంప్టన్స్‌లో 50శాతం వరకు మంటలు ఆర్పేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు.
Details
అత్యవసర పరిస్థితిని ప్రకటించిన గవర్నర్
ఈ కార్చిచ్చు కారణంగా రెండు వాణిజ్య భవనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.అయితే స్థానిక నివాసాలకు ఎలాంటి ప్రాణహాని లేదని అధికారులు స్పష్టం చేశారు.
న్యూయార్క్ నగరంపై పొగ దట్టంగా అలముకోవడంతో గాలి నాణ్యత దారుణంగా క్షీణించింది. దీనిపై గవర్నర్ హోచుల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే, మంటలను అదుపు చేయడానికి హెలికాప్టర్ల ద్వారా నీటిని చల్లుతున్నట్లు తెలిపారు.
పొగ కారణంగా గాలి నాణ్యత మరింతగా పడిపోవడంతో పరిస్థితిని సమీక్షిస్తున్నామని, వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు.