United Nations: మరణశిక్షల అమలుపై వెనక్కి తగ్గేదే లేదు.. ఐరాసలో భారత్ కీలక నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
మరణశిక్షల అమలుపై ప్రపంచవ్యాప్తంగా తాత్కాలిక నిషేధం విధించాలంటూ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (యూఎన్‌జీఏ) థర్డ్ కమిటీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. మెక్సికో ప్రతిపాదించిన ఈ తీర్మానానికి అనుకూలంగా 133 దేశాలు ఓటు వేయగా.. భారత్ సహా 33 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. మరో 16 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయని ది హిందూ కథనం పేర్కొంది.
వివరాలు
మరణశిక్షపై భారత్ వైఖరి ఇదీ..
న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఐరాసలోని భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ భవిక మంగళానందన్ దేశ వైఖరిని వివరించారు.
మరణశిక్షల విషయంలో ప్రపంచ దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదని ఆమె పేర్కొన్నారు. ప్రతి సార్వభౌమ దేశానికి తన సొంత న్యాయ వ్యవస్థను, తగిన శిక్షలను నిర్ణయించుకునే పూర్తి హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.
భారత్‌లో సరైన న్యాయ ప్రక్రియను, విస్తృతమైన రక్షణలను అనుసరించిన తర్వాతే కేవలం అత్యంత అరుదైన కేసుల్లో (Rarest of Rare) మరణశిక్ష విధిస్తామని భవిక మంగళానందన్ వివరించారు.
చట్టబద్ధమైన విచారణ అనంతరం విధించే మరణశిక్షను అన్యాయమైన హత్యలతో లేదా హింసతో పోల్చడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ స్పష్టం చేసింది.
వివరాలు
భారత్‌కు మద్దతుగా మరికొన్ని దేశాల వ్యతిరేక ఓటు
ఈ ముసాయిదా తీర్మానాన్ని భారత్‌తో పాటు అమెరికా, చైనా, జపాన్, పాకిస్థాన్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా వ్యతిరేకించాయి.
తమ దేశ చట్టాలకు అనుగుణంగా, న్యాయ సమీక్షల అనంతరమే తీవ్రమైన నేరాలకు శిక్షలు అమలు చేస్తామని భారత్ మరోసారి స్పష్టం చేసింది.