Canada: ట్రూడోపై అవిశ్వాస తీర్మానం.. జగ్మీత్‌సింగ్ కీలక నిర్ణయం
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ డెమోక్రటిక్ పార్టీ (ఎన్‌డీపీ) నేత జగ్మీత్‌సింగ్ ట్రూడో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. కెనడియన్లను ఉద్దేశించి ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఓ లేఖలో ఆయన ట్రూడోపై తీవ్ర విమర్శలు చేశారు. జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రిగా విఫలమయ్యారని, ఆయన ప్రజల కోసం కాకుండా శక్తివంతుల కోసం మాత్రమే పనిచేస్తున్నారని చెప్పారు. కెనడియన్లు తమ కోసం పనిచేసే నాయకత్వాన్ని ఎన్నుకునే సమయం ఆసన్నమైందన్నారు. హౌస్ ఆఫ్ కామన్స్‌లో తదుపరి సమావేశంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని జగ్మీత్ స్పష్టం చేశారు.
ట్రూడో 9ఏళ్ల పాలనపై సందేహాలు
ఈ అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు లభిస్తే, జస్టిన్ ట్రూడో 9 ఏళ్ల పాలన ముగియనుంది. అయితే అధికార లిబరల్ ప్రభుత్వం ఈ ప్రకటనపై ఇంకా స్పందించలేదు. ఇటీవల కెనడా ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రిలాండ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె ప్రధానమంత్రి ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నారని విమర్శిస్తూ, ఆర్థిక శాఖ మార్పులకు వ్యతిరేకంగా తన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరిహద్దు వలస సమస్యలపై ట్రూడో ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగట్టిన విషయం తెలిసిందే.
సొంత పార్టీ నేతలే ట్రూడోపై విమర్శలు
ట్రంప్ హెచ్చరికలపై సరైన నిర్ణయాలు తీసుకోలేదన్న కారణంగా ట్రూడో సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు. త్వరలో జరగే ఎన్నికల్లో ప్రజలు ట్రూడో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రతిపక్షాలతో పాటు, మిత్రపక్షాల నుంచే ట్రూడో రాజీనామాకు బహిరంగంగా పిలుపు వస్తోంది. జగ్మీత్‌సింగ్ తాజా అవిశ్వాస తీర్మానం, క్రిస్టియా రాజీనామాతో పాటు ప్రజా వ్యతిరేకత, ఈ ఎన్నికల్లో ట్రూడో రాజకీయ భవిష్యత్తుపై మేఘాలు కమ్ముకున్నట్లు కనిపిస్తోంది.