అణ్వాయుధ సంపత్తి పెంపుదల కోసం రాజ్యాంగాన్ని సవరించిన ఉత్తరకొరియా.. ప్రపంచ దేశాల ఆందోళన
ఉత్తర కొరియా మరోసారి సంచలన చర్యలకు ఉపక్రమించింది. అంతర్జాతీయ సమాజం ముందు గర్వంగా నిలబడేందుకు, తనను తాను రక్షించుకునేందుకు ముందస్తు అణుప్రయోగాలను చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు ఏకంగా ఆ దేశ రాజ్యాంగంలో మార్పులు చేర్పులకు ఒడిగట్టింది. ఈ మేరకు అధికారికంగా తమ దేశ చట్టాల్లో సవరణలు పొందుపర్చారు. రెండు రోజుల పార్లమెంట్ సమావేశాలు బుధవారంతో ముగియగా, రాజ్యంగ సవరణకు కొరియన్ పార్లమెంట్, పీపుల్స్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఉత్తరకొరియా అణుశక్తిపై తన విధానాన్నిమరింత మెరుగుపర్చుకునేందుపకు రాజ్యాంగ సవరణను ఆమోదించింది. ఈ క్రమంలోనే ఆ దేశ మీడియా గురువారం వెల్లడించింది. అమెరికా రెచ్చగొట్టే చర్యలకు వ్యతిరేకంగా అణ్వాయుధాల ఉత్పత్తిని వేగవంతం చేస్తామని ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రతిజ్ఞ చేశారు.
శత్రుదేశాలపై ప్రయోగించడమే కిమ్ లక్ష్యం
న్యూక్లియర్ ఫోర్స్ బిల్డింగ్ విధానం దేశ ప్రాథమిక చట్టంగా శాశ్వతంగా ఆమోదించారు. ఎవరూ దీన్ని అతిక్రమించేందుకు వీలు లేదని కిమ్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా -DPRK, అణు ఆయుధాల ఉత్పత్తిని విపరీతంగా పెంచడం, అణు మార్గాలను విస్తృత పర్చడం, అనంతరం వాటిని మోహరించి శత్రుదేశాలపై ప్రయోగించడమే కిమ్ ఉద్దేశంగా తెలుస్తోంది. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌ల మధ్య త్రైపాక్షిక ఒప్పందాలున్నాయి. అయితే అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలతో మైత్రీని మరింత ప్రోత్సహించాలని కిమ్ అధికారులను కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికా తన సైనిక చర్యలతో కవ్వింపులకు పాల్పడుతోందని కిమ్ భావిస్తున్నారు. ఇప్పటికేక్షిపణి ప్రయోగాలపై అమెరికా, దక్షిణకొరియా, జపాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.