UK Stabbing: బ్రిటన్‌లో రెచ్చిపోయిన దుండగులు.. రైలు ప్రయాణికులపై కత్తులతో దాడి
ఈ వార్తాకథనం ఏంటి
కేంబ్రిడ్జ్‌షైర్‌లో శనివారం అర్ధరాత్రి భయానక ఘటన జరిగింది.లండన్‌లోని డాన్‌కాస్టర్ నుంచి కింగ్స్ క్రాస్ దిశగా వెళ్తున్న రైలులో దుండగులు కత్తులతో దాడి చేశారు. ఒక్కసారిగా వారు ప్రయాణికులపై విచక్షణారహితంగా దాడి చేసి,పదిమందిని కత్తిపోట్లకు గురి చేశారు. రైలు బోగీల్లో చోటుచేసుకున్నఈ దారుణ ఘటనతో ప్రయాణికులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఆ హడావుడి మధ్యలో ఒకరు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సూచన అందుకున్న వెంటనే కేంబ్రిడ్జ్‌షైర్ పోలీసులు అత్యవసరంగా స్పందించి, రైలును హంటింగ్‌డన్ స్టేషన్‌లో ఆపేశారు. ప్రారంభ సమాచారం ప్రకారం,బాధితుల్లో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే చికిత్స అనంతరం నలుగురు డిశ్చార్జ్ కాగా, మరో ఇద్దరి పరిస్థితి మాత్రం ఇంకా ప్రాణాపాయంగా ఉందని పేర్కొన్నారు.
వివరాలు
ఆ ప్రాంతంలో రైలు రాకపోకలు నిలిపివేత
ఈ దాడి వెనుక ఉన్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ స్థానికులేనని కూడా వెల్లడించారు. కేసు తీవ్రత దృష్ట్యా కౌంటర్ టెర్రరిజం విభాగం కూడా దర్యాప్తులో భాగమైందని బ్రిటిష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీస్ (బీటీపీ) అధికారిక ప్రకటనలో తెలిపింది. ఘటన స్థలమైన రైల్వే స్టేషన్ పరిసరాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, రహదారులను అన్ని వైపులా మూసివేశారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో రైలు రాకపోకలు నిలిపివేశారు. ఈ హృదయ విదారక ఘటనపై బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, హోం సెక్రటరీ షబానా మహమూద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.