కరోనా JN.1 వేరియంట్ ఎంత ప్రమాదకరమైనది? WHO ఏం చెప్పింది?
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా JN.1 కొత్త వేరియంట్ వెలుగుచూడడం మరింత ఆందోళన కలిగిస్తోంది. JN.1 వేరియంట్ సింగపూర్, అమెరికా, చైనాలలో వేగంగా విస్తరిస్తోంది. భారతదేశంలో కూడా ఈ వేరియంట్ కేరళ, తమిళనాడులో వెలుగుచూసింది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను చేసింది. తాజాగా JN.1 వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కీలక ప్రకటన చేసింది. JN.1ను 'వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్(variant of interest) జాబితాలో డబ్ల్యూహెచ్‌ఓ చేర్చింది. అలాగే ఈ వేరియంట్ ప్రజారోగ్యానికి పెద్దగా ముప్పు కలిగించదని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి.. JN.1 వేరియంట్ ద్వారా ప్రజారోగ్యానికి వచ్చే ప్రమాదం తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది.
'వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్' జాబితాలో చేర్చడం అంటే ఏమిటి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా ప్రతి వేరియంట్‌ను రెండు విధాలుగా వర్గీకరిస్తుంది. అందులో మొదటిది- 'వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్', రెండోది 'వేరియంట్ ఆఫ్ కన్సర్న్'. కరోనా వైరస్ ప్రతి రూపాంతరం దాని రకం, ప్రమాదం స్థాయి, ఇన్ఫెక్షన్ రేటు ప్రకారం దాన్ని రెండు జాబితాల్లో ఏదో ఒక జాబితాలో చేర్చుతుంది. JN.1 ద్వారా ప్రమాదం తక్కువగా ఉన్నందన దీన్ని 'వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్' జాబితాలో చేర్చింది. చాలా ప్రమాదకరమైన రూపాంతరాలను 'వేరియంట్ ఆఫ్ కన్సర్న్' జాబితాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేర్చుతుంది. ఇంతకుముందు, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఓమిక్రాన్ రూపాంతరాలను 'వేరియంట్ ఆఫ్ కన్సర్న్' జాబితాలో డబ్ల్యూహెచ్‌ఓ చేర్చింది.
JN.1 వేరియంట్‌కు వ్యాక్సిన్ పని చేస్తుందా?
JN.1 వేరియంట్‌కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో రిలీఫ్ ప్రకటన చేసింది. ప్రస్తుతం అందిస్తున్న వ్యాక్సిన్లు JN.1 తో పాటు ఇతర కరోనా వేరియంట్లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తుందని, మరణాలను నిరోధిస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌ఓ అంచనాల ప్రకారం.. డిసెంబర్ 8 నాటికి యునైటెడ్ స్టేట్స్‌లో 15% నుంచి 29% కేసులకు సబ్‌వేరియంట్ JN.1 కారణమవుతుందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) పేర్కొంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఇతర వైవిధ్యాలతో పోలిస్తే JN.1 ప్రజారోగ్యానికి ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందనడానికి ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.