
Operation Sindhu: భారత విద్యార్థులు కోసం గగనతలాన్ని తెరచిన ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకూ తీవ్రతరమవుతున్న వేళ, ఒక కీలకమైన పరిణామం వెలుగులోకి వచ్చింది. ఇటీవల తన గగనతలాన్ని మూసివేసిన ఇరాన్ ప్రభుత్వం, ఇప్పుడు భారతదేశం కోసం ప్రత్యేకంగా మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రస్తుతం ఇరాన్‌లో చిక్కుకున్న సుమారు 1000 మంది భారతీయులు కొన్ని గంటల్లోనే స్వదేశానికి చేరుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ తరలింపు ప్రక్రియ 'ఆపరేషన్ సింధు' (Operation Sindhu) పేరుతో చేపడుతున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా, ఇరాన్‌లోని వివిధ నగరాల నుంచి ప్రత్యేక విమానాలు భారతదేశానికి బయలుదేరనున్నాయి. మొదటి విమానం శుక్రవారం రాత్రి 11 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుందని తెలుస్తోంది.
వివరాలు
ఇరాన్ నుంచి భారత్‌కు 110 మంది భారతీయ విద్యార్థులు
మరో రెండు విమానాలు శనివారం నాటికి భారత్ రావొచ్చని సమాచారం. అయితే, దీనికి ముందే 110 మంది భారతీయ విద్యార్థులు ఇప్పటికే ఇరాన్ నుంచి భారత్‌కు చేరుకున్నారు. వీరంతా తొలుత ఆర్మేనియాకు వెళ్లి, అక్కడి నుంచి భారత్ వచ్చారు. ఇక వారం క్రితం జరిగిన ఇజ్రాయెల్ మెరుపు దాడుల నేపథ్యంలో ఇరాన్‌లోని అనేక కీలక స్థావరాలు ధ్వంసమయ్యాయి. దీనికి ప్రతిస్పందనగా టెహ్రాన్ ప్రభుత్వం క్షిపణులు,డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై కౌంటర్ దాడులు చేసింది.
వివరాలు
ఇరాన్‌లో ప్రస్తుతం సుమారు 4000 మంది భారతీయులు
ఈ పరిస్థితుల్లో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేయడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే భారతీయుల తరలింపు కోసం ప్రత్యేకంగా మినహాయింపు ఇవ్వడంతో ఈ ప్రక్రియ మరింత సులభతరమవుతోంది. ఇదిలా ఉంటే, ఇరాన్‌లో ప్రస్తుతం సుమారు 4000 మంది భారతీయులు ఉన్నారని అంచనా. అందులో సగానికి పైగా, అంటే దాదాపు 2000 మంది విద్యార్థులే ఉన్నట్లు సమాచారం అందుతోంది.