Sheikh Hasina: డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు తిరిగివెళ్తా.. షేక్ హసీనా కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో రెండేళ్లకు పైగా ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 16న తిరిగి తన స్వదేశమైన బంగ్లాదేశ్‌కు వెళ్లనున్నట్లు వెల్లడించారు. ఏటా డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌లో విజయ్ దివస్ (విక్టరీ డే) నిర్వహిస్తారు. అలాంటి ప్రత్యేక రోజునే స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఆమె నిర్ణయించుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 2024 ఆగస్టు 5న తాను బంగ్లాదేశ్ విమానంలో భారత్‌కు వచ్చినందున.. తిరిగి ఢిల్లీ నుంచి స్వదేశానికి తీసుకెళ్లేందుకు బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని పంపించాలని హసీనా బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరినట్లు ఆమె సహాయకుడు వెల్లడించారు.
వివరాలు
కొత్త పాస్‌పోర్టు,జాతీయ గుర్తింపు కార్డు కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్ధించిన హసీనా
ఆ సమయంలో రాజ్యాంగ విరుద్ధంగా తనను దేశం నుంచి బహిష్కరించారని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 16న విక్టరీ డే సందర్భంగా హసీనా గౌరవప్రదంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా చూడాల్సిన బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
హసీనా కొంతకాలంగా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా తనకు కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని గతంలోనే అభ్యర్థించారు.
మరోవైపు హసీనాను స్వదేశానికి పంపించాలంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ సైనిక విమానాన్ని భారత్‌కు పంపించాలని భారత ప్రభుత్వం షరతు విధించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
లేదంటే ఇరుదేశాల మధ్య ఉన్న భూ సరిహద్దు మార్గంలో బంగ్లాదేశ్ సైన్యం ఆమెను మర్యాదపూర్వకంగా స్వీకరించాలని సూచించినట్లు సమాచారం.
వివరాలు
అధికారిక ప్రకటన చేయని బంగ్లాదేశ్ ప్రభుత్వం
ఈ పరిణామాల మధ్య హసీనా తన స్వదేశానికి తిరిగి వెళ్లే తేదీని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
అయితే, హసీనా తిరుగు ప్రయాణంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మరోవైపు ఆమె తిరిగి దేశంలోకి అడుగుపెడితే కచ్చితంగా అరెస్టు చేస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వ వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి.
హసీనాను తీసుకురావడానికి విమానాన్ని పంపించే అంశంపై భారత్‌తో ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదని కూడా స్పష్టం చేశాయి.