LOADING...
UK: అక్రమ వలసలపై ఆగ్రహం.. లండన్‌లో అల్లర్లకు దారితీసిన నిరసనలు
అక్రమ వలసలపై ఆగ్రహం.. లండన్‌లో అల్లర్లకు దారితీసిన నిరసనలు

UK: అక్రమ వలసలపై ఆగ్రహం.. లండన్‌లో అల్లర్లకు దారితీసిన నిరసనలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2025
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే) రాజధాని లండన్‌ వలస వ్యతిరేక నిరసనలతో ఉద్రిక్తంగా మారింది. యాంటీ-ఇమిగ్రేషన్ కార్యకర్త టామీ రాబిన్‌సన్‌ ఆధ్వర్యంలో 'యూనైట్ ది కింగ్‌డమ్‌' పేరిట జరిగిన ర్యాలీలో లక్ష మందికి పైగా పాల్గొన్నారని మెట్రోపాలిటన్‌ పోలీసులు వెల్లడించారు. యూకేలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద నిరసన ప్రదర్శనల్లో ఇదొకటిగా చెబుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి.

Details

26 మంది పోలీసులకు గాయాలు 

రాబిన్‌సన్ నేతృత్వంలోని ర్యాలీకి సమాంతరంగా 'స్టాండ్ అప్ టు రేసిజమ్‌' అనే ప్రదర్శన కూడా జరిగింది. దాదాపు 5 వేల మంది పాల్గొన్న ఈ కార్యక్రమం, వలస వ్యతిరేక నిరసనకారులతో ఘర్షణలకు దారితీసే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు. నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో వారు పోలీసులపై బాటిల్స్‌ సహా పలు వస్తువులతో దాడి చేశారు. ఈ ఘటనలో 26 మంది అధికారులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అల్లర్లకు పాల్పడ్డ 25 మందిని అరెస్టు చేసినట్లు, మరింతమందిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ కమిషనర్ మాట్ ట్విస్ట్ తెలిపారు.

Details

అక్రమ వలసలు పెరుగుతున్న భారం 

ఇటీవలి కాలంలో బ్రిటన్‌కు అక్రమ వలసలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 28 వేల మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్ చేరుకున్నట్లు రిపోర్టులు సూచిస్తున్నాయి. రికార్డు స్థాయికి చేరుకున్న ఈ వలసలపై స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం వలసదారులను హోటళ్లలో ఉంచుతున్న నేపథ్యంలో, స్థానికులు అక్కడికి చేరుకుని నిరసనలు చేస్తున్నారు. వలసదారులు తమ ఉద్యోగాలను దోచుకుంటున్నారని, అక్రమ వలసలు దేశానికి భారంగా మారాయని నిరసనకారులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Details

 రాజకీయాల్లో ప్రధాన అంశంగా వలసలు

వలస సమస్య బ్రిటన్ రాజకీయాల్లో ప్రధాన చర్చావిషయంగా మారింది. రిఫార్మ్ యూకే తదితర పార్టీలకు ఇది కీలక ఎజెండాగా ఉండగా, రాబిన్‌సన్ ఈ సమస్యను మరింతగా ప్రాచుర్యంలోకి తెస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. టామీ రాబిన్‌సన్‌కు బిలియనీర్‌ ఎలాన్ మస్క్ వంటి ప్రముఖుల మద్దతు ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. లండన్‌లో జరిగిన ర్యాలీలో నిరసనకారులు అమెరికా టోపీలు ధరించడమే కాకుండా ఇజ్రాయెల్ జెండాలు కూడా ప్రదర్శించారు. మరోవైపు యాంటీ ఇమిగ్రేషన్ నిరసనకారులు యూనియన్ ఫ్లాగ్‌, సెంట్‌ జార్జ్ క్రాస్ జెండాలను ఎగురవేస్తూ తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు.