
Bangladesh-India: లక్ష మంది అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు భారత్‌కి పరారీ.. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ అడ్వైజర్ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ఒకరు తీవ్ర విమర్శలు చేశారు.
భారతదేశంలో ఉన్న ఆమె, తన సొంత దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని బంగ్లాదేశ్ ప్రభుత్వ సమాచార సలహాదారు మహ్‌ఫుజ్ ఆలమ్ ఆరోపించారు.
అంతేకాదు, హసీనా, ఆమె పార్టీ అవామీ లీగ్‌కు చెందిన దాదాపు లక్ష మంది కార్యకర్తలు భారత్‌కు పారిపోయి అక్కడ ఆశ్రయం పొందుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
రంజాన్ సందర్భంగా ఢాకాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో, హసీనా ప్రభుత్వ హయాంలో అదృశ్యమైన లేదా ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబసభ్యులతో సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలమ్, మాజీ ప్రధానిపై తీవ్ర విమర్శలు చేశారు.
వివరాలు
అవామీ లీగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఉగ్రవాదులుగా లేదా మిలిటెంట్లుగా ముద్ర
''తన తల్లిదండ్రుల హత్యకు ప్రతీకారంగా హసీనా అనేక అక్రమాలకు పాల్పడ్డారు.ఆమెకు వ్యతిరేకంగా నిలబడినవారిని అంతమొందించేందుకు వెనుకాడలేదు. 2013-14 మధ్య ఓటు హక్కు కోసం ప్రజలు పోరాడిన సమయంలో అనేకమంది అదృశ్యమయ్యారు. వారి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ఆమె అనేక కుట్రలు పన్నారు'' అని ఆలమ్ ఆరోపించారు.
''అవామీ లీగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఉగ్రవాదులుగా లేదా మిలిటెంట్లుగా ముద్రవేసి, వారి హత్యలు జరిగేలా చేశారు. ఇప్పుడు కూడా, హసీనా భారత్‌లో కూర్చొని బంగ్లాదేశ్‌పై కుట్రలు పన్నుతున్నారు. ఆమెతో పాటు లక్ష మందికి పైగా అవామీ లీగ్ కార్యకర్తలు భారత్‌కు పారిపోయారు. వారికి ఆశ్రయం కల్పించడం దురదృష్టకరం'' అని ఆలమ్ విమర్శించారు.
వివరాలు
స్వదేశంలో హసీనా పై 100కి పైగా కేసులు
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, గత ఏడాది ఆగస్టు 5న షేక్ హసీనా దేశం విడిచిపెట్టి భారత్‌లో ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో, హసీనా సహా ఆమె మంత్రివర్గంలోని నాయకులు, సలహాదారులు, సైనికాధికారులపై నేర ఆరోపణలు నమోదయ్యాయి.
స్వదేశంలో హసీనా పై 100కి పైగా కేసులు ఉన్నాయని, అంతర్జాతీయ క్రిమినల్ ట్రైబ్యునల్ (ICT) ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసిందని సమాచారం.