Srilanka :శ్రీలంకలో పార్లమెంటరీ ఎన్నికలు.. ఆరుగురు సభ్యులతో సహా 190 మందిని అరెస్టు.. కారణమేటంటే..?
శ్రీలంకలో నవంబర్ 14న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ సజావుగా,సురక్షితంగా కొనసాగేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటివరకు ఎన్నికల సందర్భంలో వివిధ కేసుల్లో ఆరుగురు అభ్యర్థులతో పాటు మొత్తం 190 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులు 168 వచ్చినట్లు సమాచారం.ఇందులో 30 క్రిమినల్ కేసులు కాగా,138 ఎన్నికల చట్ట ఉల్లంఘన ఫిర్యాదులు ఉన్నాయి. హింసాత్మక చర్యలు, అక్రమాలను నిరోధించేందుకు పోలీసులు 45 వాహనాలను సీజ్ చేశారు. మొత్తం 1,259 ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి అందగా, వీటిలో 13 హింసాత్మక కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. పారదర్శకతను పెంపొందించేందుకు ఎన్నికల సంఘం,పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
శ్రీలంక పార్లమెంట్ వ్యవస్థ
225 మంది సభ్యులతో కూడిన శ్రీలంక పార్లమెంటులో 196 మంది సభ్యులు బహుళ సభ్య నియోజకవర్గాల నుంచి నేరుగా ఎన్నికవుతారు, 29 స్థానాలు జాతీయ జాబితా ఆధారంగా రాజకీయ పార్టీల పనితీరును బట్టి కేటాయిస్తారు. ఈ వ్యవస్థ చిన్నచిన్న పార్టీలతో సహా వివిధ సమూహాలకు ప్రాతినిధ్యం అందిస్తూ, దేశంలోని వివిధ జాతులు, మత జనాభాకు పార్లమెంట్‌లో వాయిస్ కల్పిస్తుంది. దీని వల్ల సింహళీయులు, తమిళులు, ముస్లింలు తదితర జాతులు ఎన్నికలలో ప్రాతినిధ్యం పొందుతారు.
కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం
ఈసారి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నాయకుడు అనురా కుమార దిసానాయకే శ్రీలంక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. వామపక్ష నేతగా ఆయన అధ్యక్ష పదవిని చేపట్టడం దేశ చరిత్రలోనే ప్రథమం. ఈ ఎన్నికల్లో అనురా, ప్రఖ్యాత అభ్యర్థులైన నమల్ రాజపక్సే, సాజిద్ ప్రేమదాస, రణిల్ విక్రమసింఘేలను ఓడించారు. అధ్యక్ష ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఎన్నికలను కూడా ప్రకటించారు. కొత్త పార్లమెంట్ ఎన్నికల అనంతరం శ్రీలంకలో కొత్త క్యాబినెట్ సమావేశం జరగనుంది.