
Pahalgam attacker: పహల్గాం దాడి నిందితుడికి పీవోకేలో అంత్యక్రియలు.. పాకిస్థాన్ పాత్రపై స్పష్టత!
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం దాడిలో పాక్ ఉగ్రవాదుల ప్రమేయానికి మరో ఆధారం బయటపడింది. ఇటీవల జరిగిన 'ఆపరేషన్ మహాదేవ్'లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడైన తాహిర్ హబీబ్‌కు పీవోకేలో జనాజా ఏ గైబ్ విధానంలో అంత్యక్రియలు నిర్వహించడమే దీనికి నిదర్శనం. ఈ విధానం మృతదేహం లేనపుడు అమలవుతుంది. రావల్‌కోట్ ఖైగలాలో జరిగిన ఈ అంత్యక్రియల కార్యక్రమానికి పలువురు పెద్దలు హాజరయ్యారు. ఈ దృశ్యాలు, ఫొటోలు ఓ టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా బయటపడ్డాయి. అంత్యక్రియల సమయంలో లష్కరే తోయిబా కమాండర్ రిజ్వాన్ హనీఫ్ తన అనుచరులతో కార్యక్రమంలో పాల్గొనాలని ప్రయత్నించాడు. అయితే తాహిర్ కుటుంబీకులు అతనికి అనుమతి ఇవ్వకపోవడంతో ఘర్షణ తలెత్తింది. హనీఫ్ పట్టుబట్టడంతో ఉగ్రవాదులు ఆయుధాలు చూపించి స్థానికులను భయపెట్టారు. ఇది అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది.
Details
ఇంటెలిజెన్స్ రికార్డుల్లో కూడా కేసు నమోదు
తాహిర్ హబీబ్ తొలుత ఇస్లామిక్ జమాత్ తలాబా, స్టూడెంట్ లిబరేషన్ ఫ్రంట్‌లో చురుకుగా పనిచేశాడు. అతడికి 'అఫ్గాని' అనే నిక్‌నేమ్ ఉండేది. ఇది ఇంటెలిజెన్స్ రికార్డుల్లో కూడా నమోదైంది. పాకిస్థాన్ సైన్యంతో తాహిర్‌కు దగ్గర సంబంధాలున్నట్లు తెలుస్తోంది. అదే అతడిని ఉగ్రవాద కార్యకలాపాల్లోకి నెట్టిందని భావిస్తున్నారు. పహల్గాం దాడికి సంబంధించిన ఉగ్రవాదులు శ్రీనగర్ సమీపంలోని మహాదేవ్ పర్వతాల్లో తలదాచుకున్నట్లు సమాచారం. ఇది 13,000 అడుగుల ఎత్తులో ఉండే మంచుతో కప్పబడిన ప్రాంతం. ఆగస్టు 2 అర్ధరాత్రి తరువాత అక్కడ చైనా తయారీ 'టీ82' అనే ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ యాక్టివేట్ అయినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. ఇదే పహల్గాం దాడిలో కూడా ఉపయోగించినట్లు తేలింది