మే9 హింసకాండ నిందితులను వదలబోం: ఆర్మీ చీఫ్
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ పై పరోక్షంగా ఆ దేశ సైన్యాధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 9 హింసాకాండకు పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ హెచ్చరించారు. దీని వెనుక ఎంతటి వారున్నా విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ పై దేశంలో తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని మునీర్ అన్నారు. తప్పుడు వార్తలు, నిజాలను దాచే వార్తలు, వక్రీకరణలు హింసాకాండకు పాల్పడిన నిందితులను ఆదుకోవని జనరల్ మునీర్ చెప్పారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పాక్ సైన్యంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి వారికి గుణపాఠం చెప్పాలని జనరల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫౌజ్ కు ఎవరూ అతీతం కాదు : జనరల్ మునీర్
అయితే లాయర్ల హత్య కేసులో ఇమ్రాన్ ఖాన్ నిందితులకు సహకరించారనే ఆరోపణలున్నాయి. ఈ మేరకు అతనిపై పలు కేసులున్నాయని తెలుస్తోంది. మరోవైపు ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ - ఇ - ఇన్సాఫ్ పై చర్యలు తీసుకోవాలని పాక్ మిలటరీ భావిస్తోంది. ఈ మేరకు బుధవారం జనరల్ అసిమ్ మునీర్ రావల్పిండిలో కమాండర్లతో ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ సైన్యానికి వ్యతిరేకంగా మే 9 తిరుగుబాటును ప్రేరేపించడంలో పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ పాత్ర ఉందన్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌లో "ఫౌజ్" అంటే సైన్యానికి ఎవరూ అతీతం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం,పబ్లిక్ ఆస్తులపై ద్వేషంతో చేసిన రాజకీయ తిరుగుబాటుపై చట్టం ఉచ్చు బిగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.