Page Loader
కార్గిల్ యుద్ధంపై రాజ్‌నాథ్‌ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన పాకిస్థాన్
కార్గిల్ యుద్ధంపై రాజ్‌నాథ్‌ సింగ్ సంచలన వ్యాఖ్యలు

కార్గిల్ యుద్ధంపై రాజ్‌నాథ్‌ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన పాకిస్థాన్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 27, 2023
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఇండో పాక్ సరిహద్దులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 24వ కార్గిల్ విజయ్ దివస్ (Kargil War)ని పురస్కరించుకుని జులై 26న రాజ్‌నాథ్‌ మాట్లాడారు. భారతదేశానికి పాకిస్థాన్ వెన్నుపోటు పొడిచిన కారణంగానే కార్గిల్ యుద్ధం మొదలైందన్నారు. అలాంటి ఘటనలు మరోసారి తలెత్తితే సువిశాల భారతదేశం ప్రయోజనాలు కాపాడుకునే క్రమంలో నియంత్రణ రేఖ(LOC) దాటేందుకూ వెనకాడబోమని తేల్చి చెప్పారు. భారతీయులకు గౌర‌వంతో పాటు ప్రతిష్టలే అన్నింటికంటే ఎక్కువ అని స్పష్టం చేశారు. దేశ కీర్తితో పాటు ప్రాదేశిక స‌మ‌గ్ర‌త‌ను కాపాడుకునేందుకు ఎంత‌వ‌రకైనా వెళ్తామని రాజ్‌నాథ్‌ సింగ్ వివరించారు.

DETAILS

చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని భారత్ కు పాక్ సలహా 

మరోవైపు రాజ్‌నాథ్‌ సింగ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. దురుసు వ్యాఖ్యలు ప్రాంతీయ శాంతి, సుస్థిరతకు ముప్పుగా పాక్ అభివర్ణించింది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం గురువారం ఓ ప్రకటన జారీ చేసింది. సౌత్ ఏషియాలో వ్యూహాత్మక వాతావరణాన్ని అస్థిరానికి గురిచేస్తాయని పేర్కొంది. ఈ క్రమంలోనే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని భారత్ కు తాము సలహా ఇస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తొలుత 24వ కార్గిల్ దివస్ సందర్భంగా రాజ్‌నాథ్‌ ద్రాస్ పరిధిలోని యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. అనంతరం కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ మేరకు పాక్ ను పరోక్షంగా హెచ్చరిస్తూ వ్యాఖ్యానించారు.