Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా న్యూక్లియర్ ఫ్యూయల్ విమానానికి నో
ఈ వార్తాకథనం ఏంటి
రూప్పూర్ అణు విద్యుత్ కేంద్రం కోసం రష్యా నుంచి బంగ్లాదేశ్‌కు రావాల్సిన 'న్యూక్లియర్ ఫ్యూయల్' సరఫరాకు పాకిస్థాన్ అడ్డంకులు సృష్టించింది. ఈ ఇంధనాన్ని తీసుకెళ్తున్న రష్యా విమానం తమ గగనతలం మీదుగా ప్రయాణించేందుకు పాకిస్తాన్ అనుమతి నిరాకరించింది. దీంతో ఇంధన సరఫరా ఆలస్యమైంది. బంగ్లాదేశ్‌లో నిర్మిస్తున్న తొలి అణు విద్యుత్ కేంద్రం రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఈ ప్రాజెక్టును రష్యాకు చెందిన ప్రభుత్వ అణుశక్తి సంస్థ రోసాటమ్ నిర్మిస్తోంది. న్యూక్లియర్ ఫ్యూయల్‌ను బంగ్లాదేశ్‌కు తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన తర్వాతే గగనతల అనుమతికి సంబంధించిన సమస్య తలెత్తినట్లు బంగ్లాదేశ్ అధికారులు వెల్లడించారు.
వివరాలు
విద్యుత్, గ్యాస్ కొరతతో బంగ్లాదేశ్ ఇబ్బందులు
రష్యా నుంచి బయలుదేరిన విమానం పాకిస్తాన్ గగనతలం మీదుగా బంగ్లాదేశ్‌కు చేరాల్సి ఉంది.
అయితే విమానానికి ముందుగా పాకిస్తాన్ ఎందుకు క్లియరెన్స్ ఇవ్వలేదన్న దానిపై స్పష్టత రాలేదు.
ఈ వ్యవహారంపై ఢాకాలోని పాకిస్తాన్ హైకమిషన్ స్పందిస్తూ.. 'టెక్నికల్, ప్రొసీజురల్ ఇష్యూస్' కారణంగానే అనుమతి సమస్య తలెత్తిందని పేర్కొంది.
దీనిని రాజకీయ అంశంగా చూడకుండా సాంకేతిక సమస్యగానే పరిగణించాలని పాకిస్తాన్ తెలిపింది.
పాకిస్తాన్ అనుమతి నిరాకరించడంతో రోసాటమ్ న్యూక్లియర్ ఫ్యూయల్ డెలివరీ షెడ్యూల్‌ను మార్చింది.
ప్రస్తుతం విద్యుత్, గ్యాస్ కొరతతో బంగ్లాదేశ్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఈ నేపథ్యంలో రూప్పూర్ అణు విద్యుత్ కేంద్రం ఆ దేశానికి కీలకంగా మారింది.
ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే బంగ్లాదేశ్‌లోని విద్యుత్ కొరతను కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది.