Imran Khan: సెక్షన్ 144 ఉల్లంఘన కింద నమోదైన కేసులో.. పాకిస్థాన్ మాజీ ప్రధానికి ఊరట..
పలు కేసుల్లో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు తాజాగా ఊరట లభించింది. 2022లో సెక్షన్ 144 ఉల్లంఘన కింద నమోదు అయిన కేసులో, ఇమ్రాన్ ఖాన్‌తో పాటు అతని సన్నిహితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ఇస్లామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు ఇమ్రాన్ ఖాన్, షేక్ రషీద్, అసద్ కైసర్, సైఫుల్లా నైజి, సాదాఖత్ అబ్బాసీ, ఫైసల్ జావేద్, అలీ నవాజ్‌లను నిర్దోషులుగా తేల్చింది. షేక్ రషీద్, పాకిస్థాన్ ఆవామీ ముస్లిం లీగ్ (AML) చీఫ్ కాగా, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో ఇంటీరియర్ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.
2022 ఏప్రిల్‌లో ఇమ్రాన్ ఖాన్ పై అనేక కేసులు
పాకిస్థాన్ తెహ్రీక్ ఇ- ఇన్సాఫ్ (PTI) పార్టీ నేతృత్వంలో 2022లో చేపట్టిన నిరసన ప్రదర్శనల సమయంలో పబ్లిక్ ఆర్డర్‌ను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఇస్లామాబాద్ అబ్బారా పోలీస్ స్టేషన్‌లో ఇమ్రాన్ ఖాన్ సహా పలువురు నేతలపై 2022 ఆగస్టు 20న కేసు నమోదు అయింది. అయితే, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ యాసిర్ మహమూద్ కోర్టు వారు వారి పై వేసిన అభియోగాలను కొట్టివేశారు. 2022 ఏప్రిల్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం రద్దయిన తరువాత ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన జైలులోనే ఉన్నారు.