
Pakistan: పహల్గాం దాడి అనంతరం పాక్ క్షిపణి ప్రయోగం
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ సంబంధాలలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ 450 కిలోమీటర్ల పరిధి కలిగిన 'అబ్దాలి' భూతల నుండి భూతలపై ప్రయోగించే క్షిపణిని విజయవంతంగా పరీక్షించామని ప్రకటించింది.
'ఇండస్' మిలిటరీ కసరత్తుల భాగంగా ఈ ప్రయోగం నిర్వహించినట్టు ఇస్లామాబాద్ వెల్లడించింది.
ఈ ప్రయోగం ద్వారా సైనికుల కార్యాచరణ సామర్థ్యం, సంసిద్ధతను పరీక్షించడమే కాకుండా, క్షిపణిలో ఉన్న ఆధునిక నావిగేషన్ వ్యవస్థ సహా ఇతర సాంకేతిక అంశాల ఖచ్చితత్వాన్ని ధ్రువీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టం చేసింది.
Details
క్షిపణి ప్రయోగాలకు అనుమతి
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24, 25 తేదీల్లో కరాచీ తీర ప్రాంతంలోని ఎకనామిక్ ఎక్స్లూజివ్ జోన్‌లో పాక్ ప్రభుత్వం భూతలం నుంచి భూతలం పైకి క్షిపణి ప్రయోగాలకు అనుమతి ఇచ్చేలా నోటిఫికేషన్ జారీ చేసింది.
అనంతరం ఏప్రిల్ 26 నుంచి 27 మధ్య మరో నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా ఏప్రిల్ 30 నుంచి మే 2 మధ్య మరో ప్రయోగానికి ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించింది.
తరచూ ఇలాంటి ప్రకటనలు చేస్తూ పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని భారత రక్షణ శాఖ వర్గాలు తీవ్రంగా విమర్శించాయి.
ఇక పహల్గాం దాడి అనంతరం భారత్ పాకిస్థాన్‌తో సంబంధాలను తెంచుకోవడంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
Details
వరుస కాల్పులకు పాల్పడుతున్న పాక్ సైన్యం
దీని ప్రభావంగా, గత తొమ్మిది రోజులుగా వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం వరుస కాల్పులకు పాల్పడుతోంది. ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ దాడికి దిగే అవకాశం ఉందని పాకిస్తాన్ మంత్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, సరిహద్దు ప్రాంతాల్లో తమ సైన్యాన్ని భారీ స్థాయిలో మోహరించడమే కాకుండా, గగనతల రక్షణ వ్యవస్థలు, ఫిరంగులు, రాడార్ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నట్లు నిఘావర్గాలు వెల్లడించాయి.
రాజస్థాన్‌లోని బార్మెర్ సమీపంలోని లాంగేవాలా సెక్టార్‌కు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో పాక్ రాడార్ మరియు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసినట్లు సమాచారం.
ఇదంతా పాకిస్థాన్ తన సైనిక ప్రస్థానం, సిద్ధతను చూపించడానికి చేస్తున్న ప్రదర్శనగా భారత నిపుణులు అభిప్రాయపడుతున్నారు.