Page Loader
Pakistan: పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌ సేవలకు పైసల కటకట.. లామినేషన్‌ కొరతతో తప్పని తిప్పలు
లామినేషన్‌ కొరతతో తప్పని తిప్పలు

Pakistan: పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌ సేవలకు పైసల కటకట.. లామినేషన్‌ కొరతతో తప్పని తిప్పలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 10, 2023
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ వాసులకు మరో కొత్త చిక్కు వచ్చి పడింది. పాకిస్థాన్‌లో కొత్త పాస్‌పోర్టుల కోసం ప్రజలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ మేరకు నిధుల లేమీతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లామినేషన్‌ పేపర్‌ కొరతతో పాస్‌పోర్ట్‌ల ముద్రణ దాదాపుగా నిలిచిపోయే దుస్థితికి వచ్చింది. ఈ కారణంగా విదేశాలకు వెళ్లాలనుకునే లక్షలాది మంది పాక్ పౌరులకు పాస్‌పోర్ట్‌ సేవల్లో తీవ్ర అంతరాయం కలుగుతోంది.ఇందుకోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్నారని తెలుస్తోంది. పాస్‌పోర్ట్‌ ముద్రణకు లామినేషన్‌ పేపర్‌ తప్పనిసరి. అయితే ఏటా వీటిని ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు పాక్‌ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్ అండ్‌ పాస్‌పోర్ట్స్‌ వెల్లడించింది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్, నిధుల్లేక దిగుమతులను నిలిపేసుకునే పరిస్థితికి వచ్చింది.

details

చెల్లింపులు లేకపోవడంతోనే దిగుమతులు రాలేదు : పాక్

ఈ క్రమంలోనే రెండు నెలల కిందే లామినేషన్ పేపర్ కోసం ఆర్డర్ పెట్టింది. కానీ చెల్లింపులు చేయకపోవడంతో దిగుమతులు రాలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా లామినేషన్‌ పేపర్‌కు ఏర్పడిన తీవ్ర కొరతతో కొత్త పాస్‌పోర్ట్‌ల ముద్రణ ఆగిపోయే దుస్థితి నెలకొంది. గతంలో రోజుకు 3 నుంచి 4 వేల పాస్‌పోర్టులను ప్రాసెస్‌ చేసేవాళ్లమన్నారు. కానీ మారిన స్థితిగతుల్లో ఈ సంఖ్య కేవలం 12 నుంచి 13కు పతనమైందని ప్రాంతీయ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఇదే పరిస్థితులు మరో రెండు, మూడు నెలలు కొనసాగనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, త్వరలోనే అన్నిసర్ధుకుంటాయని పాక్‌ హోంశాఖ మీడియా విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ఖాదిర్‌ యార్‌ తివానా అన్నారు.