Page Loader
Pakistan Train Hijack: పాక్ రైలు హైజాక్‌ ఘటన.. ఆపరేషన్‌ విజయవంతంగా ముగిసినట్లు పాక్‌ జనరల్‌ ప్రకటన 
పాక్ రైలు హైజాక్‌ ఘటన..ఆపరేషన్‌ విజయవంతంగా ముగిసినట్లు ఆర్మీ జనరల్‌ ప్రకటన

Pakistan Train Hijack: పాక్ రైలు హైజాక్‌ ఘటన.. ఆపరేషన్‌ విజయవంతంగా ముగిసినట్లు పాక్‌ జనరల్‌ ప్రకటన 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 13, 2025
08:18 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో జరిగిన రైలు హైజాక్‌ ఘటనలో మొత్తం 21 మంది ప్రయాణికులు, నలుగురు పారామిలిటరీ సైనికులు ప్రాణాలు కోల్పోయారని పాక్‌ ఆర్మీ జనరల్‌ వెల్లడించారు. ఈ ఘటనలో భద్రతా బలగాల కాల్పుల్లో 33 మంది మిలిటెంట్లు హతమయ్యారని ఆర్మీ అధికార ప్రతినిధి, లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ తెలిపారు. రైలులో ఉన్న అన్ని మిలిటెంట్లను భద్రతా దళాలు హతమార్చాయని, ఆపరేషన్‌ పూర్తిగా విజయవంతమైనదని, మిగిలిన ప్రయాణికులను రక్షించగలిగామని ఆయన పేర్కొన్నారు.

హైజాక్ 

హైజాక్‌ అయిన జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ 

బలోచిస్థాన్‌లోని పర్వతప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్‌ పఖ్తున్ఖ్వా ప్రావిన్సులోని పెషావర్‌కు వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను (Jaffar Express) బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (BLA) మిలిటెంట్లు హైజాక్‌ చేశారు. ఘటన జరిగిన సమయంలో రైలులో మొత్తం 440 మంది ప్రయాణికులు ఉన్నారు. రైలును హైజాక్‌ చేసిన బాధ్యతను బీఎల్‌ఏ మిలిటెంట్లు స్వయంగా స్వీకరించారు. వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగి విజయవంతంగా రైలును తిరిగి తమ నియంత్రణలోకి తీసుకువచ్చాయి.

ప్రతిస్పందన 

భద్రతా బలగాల ప్రతిస్పందన

లెఫ్టినెంట్‌ జనరల్‌ షరీఫ్‌ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ,''మార్చి 11న మధ్యాహ్నం 1 గంట సమయంలో బలోచ్‌ మిలిటెంట్లు రైల్వే ట్రాక్‌ను పేల్చి, రైలును తమ అధీనంలోకి తీసుకున్నారు.ఆ ప్రాంతం భౌగోళికంగా అత్యంత క్లిష్టమైనదిగా ఉంది.మిలిటెంట్లు ప్రయాణికులను రక్షణ కవచాలుగా ఉపయోగించారు.దీనికి వెంటనే స్పందించిన ఆర్మీ,ఎయిర్‌ ఫోర్స్‌,ఫ్రాంటియర్‌ కార్ప్స్‌,స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ కమాండోలు కలిసి రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు.ఈ ఆపరేషన్‌ సమయంలో మిలిటెంట్లు శాటిలైట్‌ ఫోన్ల ద్వారా అఫ్ఘానిస్థాన్‌లో ఉన్న తమ సహాయకులతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. ప్రయాణికులను రక్షణ కవచాలుగా ఉపయోగించడంవల్ల ఆపరేషన్‌ పూర్తి చేయడానికి సమయం పట్టింది.మంగళవారం సాయంత్రానికి 100 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడగా,బుధవారం మిగిలిన వారిని రక్షించగలిగాం.ఈ ఆపరేషన్‌ను అత్యంత కచ్చితంగా,జాగ్రత్తగా చేయాల్సి వచ్చింది'' అని తెలిపారు.

మిలిటెంట్ 

మిలిటెంట్లపై దాడి 

ఆత్మాహుతి బాంబర్లను మొదటగా స్నిపర్లు హతమార్చారు. అనంతరం ఒక్కో కంపార్ట్‌మెంట్‌లోని మిగిలిన మిలిటెంట్లను హతమార్చారు. ఆపరేషన్‌ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి హాని జరగలేదు. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రదేశంలో ఎలాంటి మిలిటెంట్లు మిగిలి లేరని వెల్లడించారు. అయితే బాంబు నిర్వీర్య దళం రైలును పూర్తిగా పరిశీలిస్తోంది. ఈ ఘటనలో తప్పించుకున్న ప్రయాణికులను తిరిగి ఒకే చోట చేర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ''మిలిటెంట్లకు సహాయపడే ఎవరిని వదిలిపెట్టం. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పనిచేసే ఏ విదేశీ శక్తులనూ సహించం'' అని లెఫ్టినెంట్‌ జనరల్‌ షరీఫ్‌ హెచ్చరించారు. ఈ రైలు హైజాక్‌ ఘటన పాకిస్థాన్ భద్రతా పరిస్థితిని పూర్తిగా మార్చివేసిందని ఆయన పేర్కొన్నారు.