Pakistan train hijack: పాక్ రైలు హైజాక్ ఘటన.. 16 మంది ఉగ్రవాదులు హతం, 104 మంది ప్రయాణికులు సురక్షితం
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ లో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు ప్రయాణికుల రైలును హైజాక్ (Train Hijack) చేసిన ఘటన కలకలం రేపింది.
మిలిటెంట్లు 182 మందిని బందీలుగా తీసుకెళ్లగా, భద్రతా బలగాలు 104 మందిని రక్షించాయి.
ఈ ఆపరేషన్‌లో 16 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు.
బలోచిస్థాన్ ప్రావిన్సులోని పర్వతప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్‌కు జాఫర్ ఎక్స్‌ప్రెస్ (Jaffar Express)మంగళవారం ఉదయం 9 గంటలకు బయలుదేరింది.
400 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ రైలుపై మిలిటెంట్లు ఆకస్మిక దాడి చేశారు.
మార్గమధ్యలో ఉన్న 17సొరంగాల్లో 8వసొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్‌ను పేల్చి, రైలును తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఈ దాడికి బాధ్యత తమదేనని బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది.
వివరాలు
పెషావర్, క్వెట్టా రైల్వే స్టేషన్‌లలో ఎమర్జెన్సీ డెస్క్ ఏర్పాటు
ఈ ఘటనపై వెంటనే స్పందించిన పాక్ ప్రభుత్వం,భద్రతా బలగాలను రంగంలోకి దింపి,బందీలను రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది.
ఈ క్రమంలో,ఉగ్రవాదులపై కాల్పులు జరిపి 104మందిని రక్షించామని భద్రతా వర్గాలు వెల్లడించాయి.
రక్షించబడిన వారిలో 58 మంది పురుషులు,31మంది మహిళలు,15 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపారు.
వీరందరినీ మరో రైలులో కాచీలోని మాచ్‌కు తరలించారు. ఇక 16మంది మిలిటెంట్లు హతమైనట్టు, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డట్టు అధికారులు తెలిపారు.
మిగిలిన బందీలను రక్షించేందుకు ఆపరేషన్ కొనసాగుతున్నదని,రైలులో ప్రభుత్వాధికారులు కూడా ప్రయాణిస్తున్నారని స్థానిక అధికారి పేర్కొన్నారు.
పెషావర్, క్వెట్టా రైల్వే స్టేషన్‌లలో పాక్ రైల్వే ఎమర్జెన్సీ డెస్క్ ఏర్పాటు చేశారు.
మిలిటెంట్లు రైలును హైజాక్ చేసిన సమయంలో తీవ్ర కాల్పులు,పేలుళ్లు సంభవించాయని స్థానిక మీడియా నివేదించింది.