LOADING...
US government shut down: యూఎస్‌లో మరోసారి షట్‌డౌన్‌ అమలు
యూఎస్‌లో మరోసారి షట్‌డౌన్‌ అమలు

US government shut down: యూఎస్‌లో మరోసారి షట్‌డౌన్‌ అమలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 31, 2026
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ప్రభుత్వం మరోసారి షట్‌డౌన్‌కు గురైంది. 2026 బడ్జెట్‌కు సంబంధించి కాంగ్రెస్‌ ఆమోదానికి నిర్ణయించిన గడువు అర్ధరాత్రితో ముగియడంతో, ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా శనివారం వెల్లడించింది. ఇదిలా ఉండగా, మినియాపొలిస్‌లో ఇటీవల ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ICE) అధికారుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందడం రాజకీయంగా దుమారం రేపింది. ఈ ఘటనపై సెనెట్‌ డెమోక్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "చట్టాన్ని అమలు చేసే అధికారులకు అమెరికా ప్రజలు మద్దతు ఇస్తారు. సరిహద్దు భద్రతా దళాలకు అండగా నిలుస్తారు.

Details

ఈ నిధుల బిల్లులపై మరోసారి చర్చ

కానీ వీధుల్లో భయాందోళన సృష్టిస్తూ, అమెరికా పౌరుల ప్రాణాలు తీసే ఐసీఈ అధికారులను మాత్రం ఉపేక్షించరంటూ వారు ఘాటుగా స్పందించారు. ఐసీఈ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టకపోతే నిధుల విడుదలకు సంబంధించిన బిల్లుకు తమ ఓట్లు వేయబోమని డెమోక్రాట్లు స్పష్టం చేశారు. ఈ కారణంగానే హోంలాండ్‌ సెక్యూరిటీతో పాటు ఇతర కీలక విభాగాలకు నిధులు నిలిచిపోయాయి. అయితే ఇది పూర్తిస్థాయి షట్‌డౌన్‌ కాదని, వచ్చే వారం ఈ నిధుల బిల్లుపై మరోసారి చర్చలు జరపనున్నట్లు చట్టసభ సభ్యులు తెలిపారు.

Details

ఎంతకాలం కొనసాగుతుందో ముందుగా అంచనా వేయడం కష్టమే

గతేడాది అక్టోబర్‌ 1న కూడా అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పట్లో అది దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా 43 రోజుల పాటు కొనసాగింది. అమెరికాలో షట్‌డౌన్‌ ప్రారంభమైతే అది ఎంతకాలం కొనసాగుతుందో ముందుగా అంచనా వేయడం కష్టమే. 1981 నుంచి ఇప్పటి వరకు అమెరికా ప్రభుత్వం మొత్తం 16 సార్లు మూతపడింది. 2018-19 మధ్యకాలంలోనూ సుమారు 35 రోజుల పాటు షట్‌డౌన్‌ కొనసాగగా, ఆ సమయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్నారు.

Advertisement