Page Loader
Airplane Crash: ఘోర ప్రమాదం..హెలికాప్టర్‌ను ఢీకొట్టి.. నదిలో కూలిన విమానం
ఘోర ప్రమాదం..హెలికాప్టర్‌ను ఢీకొట్టి.. నదిలో కూలిన విమానం

Airplane Crash: ఘోర ప్రమాదం..హెలికాప్టర్‌ను ఢీకొట్టి.. నదిలో కూలిన విమానం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని వాషింగ్టన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 64 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం, మరో హెలికాప్టర్‌ పరస్పరం ఢీకొన్నాయి. ల్యాండింగ్‌ సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో రెండు వాహనాలు సమీపంలోని పోటోమాక్‌ నదిలో కూలిపోయాయి. ఘటనాస్థలికి అధికారులు చేరుకుని తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం కాన్సాస్‌లోని విషిటా నుంచి బయలుదేరింది. వాషింగ్టన్ సమీపంలోని రోనాల్డ్‌ రీగన్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు సిద్ధమవుతుండగా, రక్షణ శాఖకు చెందిన సికోర్‌స్కీ హెచ్‌-60 బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. గగనతలంలో ఈ ఘర్షణ భారీ శబ్దాన్ని కలిగించింది.

వివరాలు 

ప్రమాద సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది

ఈ విమానం అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందినదిగా, దీన్ని స్థానికంగా పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌ నిర్వహిస్తోందని వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ స్పష్టం చేసింది. హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులు మాత్రమే ఉన్నారని, అందులో ఎలాంటి వీఐపీలు లేరని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. నదిలో ప్రయాణికుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ 'ఎక్స్‌'లో స్పందిస్తూ, ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హెలికాప్టర్‌ను ఢీకొట్టిన వీడియో ఇదే