
Trump vs Putin: శాంతి ప్రయత్నాలు చేస్తున్నా.. కానీ పుతిన్ వైఖరి నిరాశ కలిగిస్తోంది : డొనాల్డ్ ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగిసే అవకాశాలు లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ మధ్య భేటీ జరగడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని ఆయన అభిప్రాయపడ్డారు. నూనె, వెనిగర్‌లను కలపడం ఎంత కష్టమో, ఈ సమావేశాన్ని జరిపించడం కూడా అంతే కష్టమని ఉదాహరించారు. యుద్ధం ముగింపునకు సంబంధించి పుతిన్, జెలెన్‌స్కీలు సహకరిస్తారా లేదా అనే విషయంలో ఇంకా తనకు స్పష్టత రాలేదని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అంతేకాకుండా భవిష్యత్తులో జరిగే మీటింగ్‌కి తాను హాజరవుతానో లేదో కూడా ఇప్పుడే చెప్పలేనని స్పష్టం చేశారు.
Details
దాడులపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
ఇదిలా ఉంటే, ఉక్రెయిన్‌లోని అమెరికా ఫ్యాక్టరీలపై రష్యా వరుస దాడులు జరపడం పట్ల ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య శాంతి కోసం తాను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానని, కానీ పుతిన్ తీసుకుంటున్న నిర్ణయాలు తనకు అసంతృప్తి కలిగిస్తున్నాయని ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధంపై పుతిన్, జెలెన్‌స్కీల వైఖరి అర్థం చేసుకోవడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుందని ఆయన తెలిపారు. ఆ లోపు వారు ఒప్పందానికి రాకపోతే తానే ఒక నిర్ణయం తీసుకుంటానని, ఆ నిర్ణయం భారీ ఆంక్షలా, సుంకాలా లేదా రెండూ కావొచ్చని వెల్లడించారు. ఇకపై కూడా శాంతియుత చర్చల కోసం తాను కృషి చేస్తూనే ఉంటానని ట్రంప్ పేర్కొన్నారు.