China: చైనాలో యాగి తుపాను తిప్పలు.. సెల్‌ఫోన్‌లలో ఛార్జింగ్ లేక నానా తంటాలు
చైనాలో యాగి తుపాను తీవ్ర బీభత్సం సృష్టించింది. ఈ తుపాను కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో, సెల్‌ఫోన్‌ల ఛార్జింగ్ లేకపోవడంతో తాత్కాలిక ఛార్జింగ్ పాయింట్ల వద్ద ప్రజలు క్యూ లైన్లలో నిలబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హైనాన్ ప్రావిన్స్‌లో ఈ తుపాను కారణంగా బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిశాయి.వీటి వల్ల విద్యుత్తు సరఫరాకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. సెల్‌ఫోన్‌లు ఛార్జింగ్ లేకపోవడం వల్ల డిజిటల్ చెల్లింపులు కుదరని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నింటిలో,ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. ప్రభుత్వం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేసిన తర్వాత,వాటి వద్ద తుపాను బాధితులు బారులు తీరారు.
యాగి తుపాను కారణంగా.. 197 మంది మృతి
ఇదిలా ఉండగా, యాగి తుపాను కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 197 మంది మృతుల సంఖ్య చేరింది. 125 మందికి పైగా గల్లంతయ్యారని వార్తలు సూచిస్తున్నాయి. ఉత్తర వియత్నాంలోని లావో కై ప్రావిన్స్‌లోని లాంగ్‌ను కుగ్రామం వరదలకు కొట్టుకుపోయిన ఘటనలో తాజాగా ఏడు మృతదేహాలు లభించాయి. ఈ పరిణామంతో మృతుల సంఖ్య పెరిగింది, ఇంకా పలువురు ఆచూకీ తెలియరాలేదు. నిపుణులు వాతావరణంలో మార్పులు వల్ల యాగి వంటి తుపానులు బలపడుతున్నాయని చెబుతున్నారు.