
UAE Golden Visa: యుఎఇలో శాశ్వత నివాసం: ఆస్తిలో పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు.. కుటుంబ సభ్యులనూ దుబాయ్‌కు తీసుకురావచ్చు
ఈ వార్తాకథనం ఏంటి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అందించే 'గోల్డెన్ వీసా'కు గణనీయమైన ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు మార్గాల్లో గోల్డెన్ వీసాలు జారీ అవుతున్నా, తాజాగా యూఏఈ ప్రభుత్వం పూర్తిగా భిన్నమైన విధానంతో కొత్త రకమైన గోల్డెన్ వీసాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈసారి 'నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసా'లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనుంది. ప్రాథమిక దశలో భారతదేశం, బంగ్లాదేశ్‌కు చెందిన అభ్యర్థులపై ఈ విధానాన్ని ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ పని కోసం యూఏఈ, భారతదేశంలో రయాద్ గ్రూప్ అనే కన్సల్టెన్సీ సంస్థను అధికారికంగా ఎంపిక చేసింది.
వివరాలు
ఈ కొత్త వీసా విధానానికి 5,000 మందికి పైగా భారతీయులు దరఖాస్తు చేయచ్చు
ఇప్పటి వరకూ భారతీయులు దుబాయ్ గోల్డెన్ వీసా పొందాలంటే, కనీసం 20 లక్షల ఏఈడీ (దాదాపు రూ.4.66 కోట్లు) విలువైన స్థిరాస్తి కొనుగోలు చేయాలి లేదా భారీ స్థాయిలో వ్యాపార పెట్టుబడులు పెట్టాలి. అయితే తాజాగా ప్రవేశపెట్టిన నామినేషన్ విధానం ప్రకారం, కేవలం లక్ష ఏఈడీ (సుమారు రూ.23.30 లక్షలు) ఫీజు చెల్లించి జీవితకాల గోల్డెన్ వీసా పొందే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థతో పంచుకున్నాయి. ప్రాథమికంగా వచ్చే మూడు నెలల్లోనే 5,000 మందికి పైగా భారతీయులు ఈ కొత్త వీసా విధానానికి దరఖాస్తు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
వివరాలు
భారతీయుల కోసం ఒక "సువర్ణావకాశం"
ఈ అవకాశాన్ని భారతీయుల కోసం ఒక "సువర్ణావకాశం"గా అభివర్ణించిన రయాద్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రయాద్ కమల్ అయూబ్ మాట్లాడుతూ.. "ఈ వీసాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నేపథ్యాన్ని మేము పూర్తి స్థాయిలో పరిశీలిస్తాం. ఇందులో యాంటీ మనీలాండరింగ్ రిపోర్ట్, క్రిమినల్ రికార్డులు, సోషల్ మీడియా యాక్టివిటీలు వంటి అంశాలు పరిశీలనకు వస్తాయి. అభ్యర్థి ఆర్థికం, సాంకేతిక విజ్ఞానం, స్టార్టప్‌లు, ఉద్యోగ రంగాల ద్వారా యూఏఈకి ఎలా లాభం చేకూర్చగలడన్న దానిపై విశ్లేషణ జరిపి, ఆ నివేదికను ప్రభుత్వానికి పంపుతాం" అని వివరించారు.
వివరాలు
జీవితాంతం చెల్లుబాటు అయ్యే నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసా
దరఖాస్తుదారులు దుబాయ్‌కి ప్రత్యక్షంగా రావాల్సిన అవసరం లేకుండా, స్వదేశం నుంచే ముందస్తు అనుమతి పొందవచ్చు. రయాద్ గ్రూప్ స్ధాపించిన రిజిస్టర్డ్ కార్యాలయాలు, అధికారిక ఆన్‌లైన్ పోర్టల్, వన్‌వాస్కో వీసా సేవల కేంద్రాలు, ప్రత్యేక కాల్ సెంటర్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ వీసాను పొందినవారు తమ కుటుంబ సభ్యులను కూడా దుబాయ్‌కు తీసుకురావచ్చు. అంతేకాకుండా, వ్యక్తిగత సహాయకులు, డ్రైవర్లను నియమించుకోవచ్చు. స్థానికంగా ఉద్యోగం చేయడం, వ్యాపారం మొదలుపెట్టడం వంటి అవకాశాలు కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఈ నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసా జీవితాంతం చెల్లుబాటవుతుంది. ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా భారతదేశం, బంగ్లాదేశ్‌లలో ప్రారంభించగా, త్వరలోనే చైనా సహా ఇతర దేశాలకూ ఈ పథకాన్ని విస్తరించనున్నట్లు సమాచారం.