Page Loader
విమానంలో విషాదం.. ఫ్లైట్ గాల్లో ఉండగా బాత్రూమ్‌లో కుప్పకూలిన పైలట్‌
ఫ్లైట్ గాల్లో ఉండగా బాత్రూమ్‌లో కుప్పకూలిన పైలట్‌

విమానంలో విషాదం.. ఫ్లైట్ గాల్లో ఉండగా బాత్రూమ్‌లో కుప్పకూలిన పైలట్‌

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 17, 2023
02:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

లాటమ్‌ ఎయిర్‌లైన్స్‌ లో విషాదం చోటు చేసుకుంది. ఈ మేరకు ఫ్లైట్ గాల్లో ఉండగానే పైలెట్ హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఎగురుతున్న విమానంలో పైలెట్ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అమెరికాలోని మియామి నుంచి చిలీ బయల్దేరిన విమానంలో పైలట్‌ అకస్మాత్తుగా కుప్పకూలారు. వెంటనే అప్రమత్తమైన ఇతర పైలెట్లు (CO-PILOTS) విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే పైలట్‌ తుది శ్వాస విడిచినట్లు గుర్తించారు. గత ఆదివారం లాటమ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం రాత్రి మియామీ విమానాశ్రయం నుంచి చిలీ రాజధాని శాంటియాగోకు టేకాఫ్ తీసుకుంది. విమానం ఎగిరిన మూడు గంటల తర్వాత కెప్టెన్‌ ఇవాన్‌ ఆండౌర్‌ అనారోగ్యానికి గురయ్యారు.

DETAILS

పనామా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన కో పైలెట్లు

ఈ క్రమంలోనే బాత్రూమ్‌కు వెళ్లి అక్కడ కుప్పకూలిపోయారు. గమనించిన మెడికల్ స్టాఫ్ ప్రాథమిక చికిత్సలు అందించినా పైలెట్ ఆరోగ్య పరిస్థితి మెరుగపడలేదు. అప్రమత్తమైన కో-పైలట్లు విమానాన్ని సమీపంలోని పనామా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం అత్యవసర వైద్య సేవల బృందం సిబ్బంది హుటాహుటిన ఇవాన్‌ను పరిశీలించగా అప్పటికే ఆయన ప్రాణం విడిచినట్లు వైద్యులు నిర్థారించారు. 56 ఏళ్ల ఇవాన్‌ గత 25 ఏళ్లుగా పైలట్‌గా కొనసాగుతున్నారు. ఆకస్మిక మృతిపై లాటమ్‌ సంస్థ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఘటన సమయంలో 271 మంది ప్రయాణికులు, సిబ్బంది విమానంలో ఉండగా, వారిని మరుసటి రోజు చిలీకి చేర్చామని సంస్థ ప్రకటన చేసింది.