Canada Student Visa: కెనడాకు వెళ్లాలనుకుంటున్నారా?.. ఏటా లక్షన్నర మందికే ఛాన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
వలసల సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక వలసలపై కఠిన నియంత్రణ విధించే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విదేశీ విద్యార్థుల రాకపై పరిమితులు విధించింది. వచ్చే రెండేళ్ల పాటు ఏటా లక్షన్నర మంది విదేశీ విద్యార్థులను మాత్రమే తమ దేశంలోకి అనుమతించనున్నట్లు ప్రకటించింది. విద్యా అవకాశాలు, శ్రామిక శక్తి అవసరాల మధ్య సమతుల్యత పాటించడంతో పాటు వసతి, ప్రజా సేవలపై ఒత్తిడిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) వెల్లడించింది. విద్యార్థులే కాకుండా ఇతర వలసదారుల సంఖ్యపైనా పరిమితులు విధించింది.
వివరాలు
2027 నుంచి ఏటా 3.7 లక్షల మందికే అవకాశం
తాజా నిర్ణయం ప్రకారం.. 2027 నుంచి 2029 వరకు కెనడా ఏటా 3.7 లక్షల మంది తాత్కాలిక వలసదారులను మాత్రమే దేశంలోకి అనుమతించనుంది.
వీరిలో 1.5 లక్షల మంది విదేశీ విద్యార్థులు కాగా.. మిగిలిన 2.2 లక్షల వీసాలను తాత్కాలిక విదేశీ ఉద్యోగులకు కేటాయించనుంది.
ఈ ఏడాది కూడా కెనడా ఇలాంటి నిబంధనలను అమలు చేసింది. అయితే, 2026లో 1.55 లక్షల మంది విదేశీ విద్యార్థులకు అనుమతి ఇచ్చింది.
ఈ నిబంధనలు కెనడాకు రావాలనుకునే కొత్త వారికి మాత్రమే వర్తిస్తాయని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజా నిర్ణయంతో కెనడాలో చదువుకోవాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది.
వివరాలు
వసతి, ప్రజా సేవలపై ఒత్తిడి తగ్గించేందుకే..
ఇటీవలి కాలంలో కెనడాలో తాత్కాలిక వలసదారుల జనాభా గణనీయంగా పెరిగింది. దీంతో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
విదేశీయుల సంఖ్య పెరగడంతో వసతి సౌకర్యాలు అందుబాటులో ఉండటం లేదని, ప్రజా సేవలపైనా ఒత్తిడి పెరుగుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలోనే కెనడా ప్రభుత్వం వలసలపై నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా.. కెనడా ఏటా 2.44 లక్షల మందికి శాశ్వత నివాస హోదా కల్పిస్తోంది.