LOADING...
Mojtaba Khamenei: గాయాల తీవ్రతతో మొజ్తాబా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ..?
గాయాల తీవ్రతతో మొజ్తాబా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ..?

Mojtaba Khamenei: గాయాల తీవ్రతతో మొజ్తాబా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 24, 2026
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ సుప్రీం నేత మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై తాజాగా సంచలన సమాచారం బయటకొచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్‌ తొలి దాడుల్లో ఖమేనీ తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ దాడుల్లో ఆయన కాలికి గాయం కావడంతో పాటు ముఖం కూడా కాలిపోయినట్లు తెలుస్తోంది. ఖమేనీ ప్రస్తుతం జీవించి ఉండి, స్పృహలోనే చురుకుగా ఉన్నప్పటికీ, గాయాల తీవ్రత కారణంగా చికిత్స కొనసాగుతోందని సమాచారం. కాలికి గాయం కావడంతో ఇప్పటికే మూడుసార్లు శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు, అవసరమైతే కృత్రిమ కాలు అమర్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. చేతికి కూడా ఆపరేషన్‌ జరగ్గా, దాని పరిస్థితి ప్రస్తుతం మెరుగుపడిందని తెలుస్తోంది. అయితే ముఖం, పెదవులు తీవ్రంగా కాలిపోవడంతో మాట్లాడటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

వివరాలు

రహస్య ప్రాంతంలో చికిత్స

ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌ సర్జరీ చేయాల్సి రావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఖమేనీని ఒక రహస్య ప్రాంతంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఆయనతో సమాచార మార్పిడికి సాధారణ కమ్యూనికేషన్‌ మార్గాల బదులుగా చేతిరాత ఉత్తరాలనే వినియోగిస్తున్నారని తెలుస్తోంది. ఈ ఉత్తరాలను మోటార్‌సైకిళ్ల ద్వారా రహస్య స్థలానికి చేరవేసి, తిరిగి ఆయన సమాధానాలను తీసుకువస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇజ్రాయెల్‌ నిఘాకు చిక్కకుండా ఉండేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఆయనను ప్రత్యక్షంగా కలవడం లేదని సమాచారం.

వివరాలు

ఈ బోర్డుకు డైరెక్టర్‌గా ఖమేనీ

ఇక దేశ పరిపాలన కొనసాగించేందుకు ఖమేనీ ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసినట్లు ఇరాన్‌ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్‌కు సన్నిహితుడైన రాజకీయవేత్త అబ్దుల్ రెజా దావరి వెల్లడించారు. ఈ బోర్డుకు ఖమేనీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు చెందిన జనరల్స్‌ సభ్యులుగా ఉన్నారని తెలిపారు. యుద్ధం, దౌత్యం, జాతీయ భద్రత వంటి కీలక అంశాల్లో ఈ బోర్డు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటోందని వెల్లడించారు.

Advertisement