LOADING...
Tarique Rahman: పార్టీ అధినేత తారిక్ రహ్మాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు
పార్టీ అధినేత తారిక్ రహ్మాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు

Tarique Rahman: పార్టీ అధినేత తారిక్ రహ్మాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 13, 2026
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో నిర్వహించిన తాజా పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) భారీ విజయం సాధించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత తారిక్ రహ్మాన్‌కు శుక్రవారం ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాస్వామ్య విలువలు,అభివృద్ధి దిశలో ముందుకు సాగే బంగ్లాదేశ్‌కు భారత్ అండగా నిలుస్తుందని మోదీ స్పష్టం చేశారు. గురువారం బంగ్లాదేశ్‌లో 13వజాతీయ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతురాలైన అనంతరం జరిగిన తొలి ఎన్నికలుగా ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వెలువడుతున్న అనధికారిక ఫలితాల ప్రకారం, 17 సంవత్సరాల విదేశీ ప్రవాస జీవితం తర్వాత ఇటీవలే స్వదేశానికి తిరిగొచ్చిన తారిక్ రహ్మాన్ నాయకత్వంలోని బీఎన్‌పీ,మొత్తం 300 స్థానాలున్న పార్లమెంట్‌లో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది.

వివరాలు 

తారిక్ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం 

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో స్పందించారు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్‌పీని విజయం వైపు నడిపించినందుకు తారిక్ రహ్మాన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయం తారిక్ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని, రెండు దేశాల మధ్య బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయాలని ఆశిస్తున్నట్లు మోదీ వెల్లడించారు.

వివరాలు 

తారిక్ రహ్మాన్‌కు అభినందనలు తెలిపిన అమెరికా 

ఇదిలా ఉండగా, అమెరికా కూడా తారిక్ రహ్మాన్‌కు అభినందనలు తెలియజేసింది. అయితే బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా తుది ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. అనధికారిక లెక్కల ప్రకారం బీఎన్‌పీ నేతృత్వంలోని కూటమి 200కుపైగా స్థానాల్లో విజయం సాధించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తారిక్ రహ్మాన్ బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ 

Advertisement