
PM Modi: మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి గుర్తింపు..
ఈ వార్తాకథనం ఏంటి
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రెజిల్ దేశం అత్యున్నత పౌర బహుమతిగా గుర్తించబడే 'గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్' పురస్కారం లభించింది. భారత-బ్రెజిల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ పోషించిన పాత్ర,అంతర్జాతీయ స్థాయిలో ఇరుదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించే దిశగా ఆయన చేస్తున్న కృషికి గానూ,బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియోలులాడ సిల్వా ఈ బహుమతిని మంగళవారం మోదీకి అందించారు. ఇలాంటి అంతర్జాతీయ పురస్కారాలను ప్రధాని మోదీ అందుకోవడం ఇది 26వ సారి కావడం విశేషం. ఈ గౌరవం తన వ్యక్తిగతంగా మాత్రమే కాదు,140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని,ఇది తనకు హృదయానికి హత్తుకునే క్షణంగా నిలిచిందని మోదీ వ్యాఖ్యానించారు.
వివరాలు
రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2000 కోట్ల డాలర్లకు పెంచడమే లక్ష్యం
లులా డ సిల్వాతో ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ - వివాదాలను పరిష్కరించాలంటే వాటిని చర్చలు, దౌత్యపరమైన మార్గాల్లోనే ఎదుర్కోవడం అవసరమని, ఇది ఇరు దేశాలూ పంచుకుంటున్న అభిప్రాయమని తెలిపారు. ప్రపంచంలో అస్థిరత,ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, బ్రెజిల్-భారతదేశాల భాగస్వామ్యం ప్రపంచానికి సుస్థిరత,సమతౌల్యతను అందించే మూలస్తంభంలా నిలుస్తుందని ఆయన అన్నారు. రక్షణ రంగంలో బలోపేతం అవుతున్న పరస్పర సహకారం, ఒకరిపై ఉన్న విశ్వాసానికి సంకేతమని మోదీ చెప్పారు. పర్యావరణ పరిరక్షణ,శుద్ధ ఇంధన రంగాలు ఇరుదేశాలకు సమాన ప్రాధాన్యంగా ఉన్నాయని, రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2000 కోట్ల డాలర్లకు పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు.
వివరాలు
మోదీకి 14 అశ్వాల కవాతుతో ఘన స్వాగతం
ఇక ఉగ్రవాదం,దానికి మద్దతు ఇచ్చే వారిపై తీవ్ర వ్యతిరేకతతో వ్యవహరిస్తామని మోదీ స్పష్టంచేశారు. ఇది భారత-బ్రెజిల్ నేతలు విడుదల చేసిన సంయుక్త పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. వాణిజ్యం,పెట్టుబడులు,రక్షణ,భద్రత,ఆరోగ్యం,ఔషధాల పరిశ్రమ, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై నేతలు విస్తృతంగా చర్చించారు. వీరి సమక్షంలో పలు ద్వైపాక్షిక ఒప్పందాలకు సంతకాలు జరిగాయి. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న మోదీ, రియో డి జనీరో నుంచి బ్రసీలియాకు చేరుకున్న సందర్భంగా 114 అశ్వాల కవాతుతో ఘన స్వాగతం అందుకున్నారు.
వివరాలు
ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదు: బ్రెజిల్
ప్రపంచంలో మారిన రాజకీయ పరిణామాల మధ్య, ఇప్పుడు ప్రపంచానికి ఏకాధిపత్యం లేదా చక్రవర్తి అవసరం లేదని బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా స్పష్టంగా పేర్కొన్నారు. బ్రిక్స్‌కు అనుకూలంగా ఉన్న దేశాలపై అదనంగా 10 శాతం సుంకాలు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు గురించి స్పందిస్తూ లులా గట్టి విమర్శలు చేశారు.
వివరాలు
బ్రిక్స్ కూటమి ఎవరినైనా వ్యతిరేకించాలనే ఉద్దేశంతో పని చేయదు
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ముగింపు సందర్భంలో మాట్లాడుతూ "ప్రపంచం ఇక మునుపటిలా లేదు, చాలా మారిపోయింది. అందువల్ల ప్రపంచాన్ని ఏకంగా నడిపించే చక్రవర్తి అవసరం లేదు. ప్రతి దేశానికి తమ సార్వభౌమాధికారం ఉందనే విషయం గుర్తించాలి. ట్రంప్ సుంకాలను విధిస్తే, ఇతర దేశాలకూ అదే విధంగా స్పందించడానికి హక్కు ఉంది. సుంకాల విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచి ప్రపంచాన్ని బెదిరించడం బాధ్యతారాహిత్యంగా ఉంది. ఇలాంటి అంశాలను చర్చించేందుకు అనేక అంతర్జాతీయ వేదికలు ఉన్నాయి" అని ఆయన వివరించారు. బ్రిక్స్ కూటమి ఎవరినైనా వ్యతిరేకించాలనే ఉద్దేశంతో పని చేయదని, కానీ ప్రపంచ రాజకీయాల్లో సవ్యమైన ప్రత్యామ్నాయ వేదికగా నిలవాలనే ఆశయంతో ముందుకెళ్తుందని లులా డ సిల్వా స్పష్టం చేశారు.