మెక్సికోలో నరమేధం.. క్షణ క్షణం భయాందోళనకరం.. 45 బ్యాగుల్లో మానవ శరీర అవయవాలు
నార్త్ అమెరికా దేశం మెక్సికోలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటే ఎవరైనా ఇట్టే భయపడతారు. అలాంటి దారుణమైన నేర ఘటన అది. మానవ శరీర భాగాలతో ఉన్న బ్యాగులు వెలుగు చూడటమే దీనికి కారణం. మెక్సికోలో సుమారు 45 బ్యాగుల్లో మానవ శరీర అవయవాలను అక్కడి పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల నుంచి మిస్సింగ్ లో ఉన్న యువతీ యువకుల గురించి విచారిస్తున్న క్రమంలోనే ఈ క్రూరం ఆలస్యంగా బహిర్గతమైంది. జాలిస్కో రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతం గాడలాజారాకు సమీపంలోని ఓ లోయలో దాదాపుగా 45 బ్యాగుల మానవ శరీర భాగాలు కనిపించాయి.
అవి స్త్రీ, పురుషుల శరీర భాగాలే : స్టేట్ ప్రాసిక్యూట్ ఆఫీస్
ఆయా బ్యాగులపై దర్యాప్తు చేయగా, అవి స్త్రీ, పురుషుల శరీర భాగాలని ప్రాసిక్యూట్ ఆఫీస్ నిర్థారించింది. మే 20న 30 ఏళ్ల వయసు ఉన్న ఏడుగురు యువతీ యువకులు మిస్ అయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతులంతా ఒకే కాల్ సెంటర్ లో పనిచేస్తున్నా, మిస్సింగ్ కేసులు మాత్రం వేర్వేరు రోజుల్లో నమోదవడం గమనార్హం. మరో పక్క కాల్ సెంటర్‌కు దగ్గర్లోనే ఈ బ్యాగులు దొరికినట్లు అధికారులు స్పష్టం చేశారు. సదరు కాల్ సెంటర్‌పై అనేక అనుమానాలు చెలరేగగా, అందులో చట్టవిరుద్ధ వ్యవహారాలు నడుస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. మాదకద్రవ్యాలు, రక్తపు మరకలతో ఉన్న వస్తువులు, కొన్ని దస్త్రాలను సైతం గుర్తించినట్లు లోకల్ మీడియా కోడై కూస్తోంది.