Page Loader
Xi Jinping: చైనాలో రాజకీయ కలకలం? బ్రిక్స్‌ సమావేశానికి జిన్‌పింగ్ గైర్హాజరు!
చైనాలో రాజకీయ కలకలం? బ్రిక్స్‌ సమావేశానికి జిన్‌పింగ్ గైర్హాజరు!

Xi Jinping: చైనాలో రాజకీయ కలకలం? బ్రిక్స్‌ సమావేశానికి జిన్‌పింగ్ గైర్హాజరు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 06, 2025
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అనుమానాస్పదంగా పలు కార్యక్రమాలకు గైర్హాజరవుతుండటంతో, ఆ దేశంలో ఆంతర్గత రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంది. 13 ఏళ్లుగా చైనాను పాలిస్తున్న జిన్‌పింగ్, మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తివంతమైన నేతగా అభివర్ణించబడుతున్నారు. ఆయన పదవి నుంచి తప్పుకోబోతున్నారనే ఊహాగానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన బ్రెజిల్‌లో జరుగుతున్న 'బ్రిక్స్‌' సమ్మిట్‌కు హాజరుకాకపోవడం మరింత చర్చకు దారితీసింది. జూలై 6-7 తేదీల్లో రియో డి జనీరోలో జరుగుతున్న ఈ సమావేశాలకు జిన్‌పింగ్ హాజరుకాలేదు. 12 ఏళ్లుగా ప్రతి సారి పాల్గొంటూ వస్తున్న జిన్‌పింగ్‌ ఈ ఏడాది మాత్రం బ్రిక్స్‌ సమ్మిట్‌ను పాసవేశారు.

Details

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు

ఆయన స్థానంలో ప్రీమియర్‌ లి కియాంగ్ చైనాను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వీడియో లింక్ ద్వారా సమ్మిట్‌లో పాల్గొంటుండగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హాజరయ్యారు. జిన్‌పింగ్ గైర్హాజరు విషయంలో రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. అమెరికా-చైనా సంబంధాలపై పరిశోధన చేసే నిపుణుడు గోర్డాన్ చాంగ్ స్పందిస్తూ, జిన్‌పింగ్ రాజకీయంగా బలహీనపడుతున్న సంకేతమే ఇది అని వ్యాఖ్యానించారు. చైనాలోని రాజకీయ నిచ్చెనలో అతని ప్రభావం తగ్గుతున్నట్లు ఈ పరిణామం సూచిస్తోందని ఎక్స్ (ట్విట్టర్) ద్వారా అభిప్రాయపడ్డారు.

Details

షెడ్యూల్ కుదరకపోవడం వల్లే గైర్హాజరు

అయితే దీనికి భిన్నంగా, జిన్‌పింగ్ బ్రెజిల్‌ ప్రెసిడెంట్ లులాతో ఈ ఏడాది ఇప్పటికే భేటీ అయిన నేపథ్యంలో, షెడ్యూల్ కుదరకపోవడం వల్లే ఆయన హాజరుకాలేదని ఓ ప్రముఖ మీడియా పేర్కొంది. 2009లో బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా కలిసి బ్రిక్స్‌ కూటమిని ఏర్పాటు చేయగా, 2010లో దక్షిణాఫ్రికా చేరింది. ఆ తర్వాత ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు ఈ గ్రూపులోకి వచ్చాయి. ఈ కూటమికి చెందిన దేశాల భవిష్యత్‌ ప్రాధాన్యం పెరుగుతున్న సమయంలో జిన్‌పింగ్‌కు సంబంధించిన తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.