LOADING...
Anti-ICE protest: అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో జోరందుకున్న 'యాంటీ ఐస్‌' ఆందోళనలు..!
అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో జోరందుకున్న 'యాంటీ ఐస్‌' ఆందోళనలు..!

Anti-ICE protest: అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో జోరందుకున్న 'యాంటీ ఐస్‌' ఆందోళనలు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2025
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ICE) అధికారుల చర్యలపై లాస్‌ ఏంజెలెస్‌లో మొదలైన నిరసనలు క్రమంగా దేశవ్యాప్తంగా ఇతర నగరాలకు వ్యాపించాయి. శాన్‌ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌, సియాటెల్‌, డల్లాస్‌, లూయిస్‌విల్లే, శాన్‌ ఆంటోనియో, షికాగో వంటి అనేక నగరాల్లో ఆందోళనలు చెలరేగాయని ప్రముఖ మీడియా సంస్థలు సీఎన్‌ఎన్‌, టైమ్స్‌ మ్యాగజైన్‌ వెల్లడించాయి. శాన్‌ ఫ్రాన్సిస్కోలో 150 మందిని అరెస్టు చేయగా, న్యూయార్క్‌లో కూడా పలువురు నిరసనకారులు పోలీసుల అదుపులోకి వెళ్లినట్టు సమాచారం. సోమవారం రాత్రి శాన్‌ ఫ్రాన్సిస్కో సివిక్‌ సెంటర్‌ వద్ద భారీగా ప్రజలు గుమికూడి ఐసీఈ అధికారుల దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

వివరాలు 

అరెస్టులే ఆందోళనలకు కారణం 

ప్రతిరోజు కనీసం 3,000 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేయాలని ట్రంప్‌ పరిపాలన తాజా ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ ఆదేశాల నేపథ్యంలో లాస్‌ ఏంజెలెస్‌ నగరంలోని లాటిన్‌ వలసదారులు అధికంగా నివసించే ప్రాంతాల్లో శుక్రవారం ఐసీఈ దాడులు ప్రారంభమయ్యాయి. దక్షిణ లాస్‌ ఏంజెలెస్‌లో హిస్పానిక్‌ జనాభా సుమారు 82 శాతంగా ఉంది. అక్కడ జరిగిన ఒకే ఒక్క ఆపరేషన్‌లో 44 మంది అక్రమ వలసదారులను ఐసీఈ అధికారులు అరెస్టు చేశారు. ఇక గ్రేటర్‌ లాస్‌ ఏంజెలెస్‌ పరిధిలో నిర్వహించిన దాడుల్లో కూడా అనేక మంది వలసదారులు అధికారుల వలలో చిక్కారు.

వివరాలు 

2,000 మంది నేషనల్‌ గార్డ్‌ల మోహరింపు 

ఈ విషయాన్ని అధికారికంగా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో లాస్‌ ఏంజెలెస్‌, పారామౌంట్‌, కాప్టన్‌ ప్రాంతాల్లో ఐసీఈ చర్యలపై వ్యతిరేకత మరింత పెరిగింది. నిరసనకారులు డెటెన్షన్‌ సెంటర్ల వద్ద గుమికూడి నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ట్రంప్‌ సర్కార్‌ 2,000 మంది నేషనల్‌ గార్డ్‌లను మోహరిస్తామని ప్రకటించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. అయితే కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నేషనల్‌ గార్డ్స్‌ అవసరం లేదని స్పష్టంగా ప్రకటించారు. అయినప్పటికీ ట్రంప్‌ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. పైగా తాజాగా మరో 700 మెరైన్లు, అదనంగా మరో 2,000 మంది నేషనల్‌ గార్డ్‌లను మోహరించేందుకు ఆదేశాలు జారీ చేశారు.

వివరాలు 

నేషనల్‌ గార్డ్‌ వ్యవస్థపై వివరణ 

అమెరికాలో నేషనల్‌ గార్డ్‌ ఒక ప్రత్యేక హైబ్రీడ్‌ విభాగంగా పనిచేస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు,ఫెడరల్‌ ప్రభుత్వానికి అనుబంధంగా ఉంటుంది. సాధారణంగా రాష్ట్రాల్లో గవర్నర్‌ ఆదేశాల మేరకు నేషనల్‌ గార్డ్‌ను రంగంలోకి తీసుకొస్తారు. కానీ ఈసారి ట్రంప్‌ తనకున్న అరుదైన ఫెడరల్‌ అధికారాలను వినియోగించి, నేషనల్‌ గార్డ్‌లను లాస్‌ ఏంజెలెస్‌లో మోహరించారు. ఈ తరహాలో ఒక అధ్యక్షుడు నేరుగా ఈ స్థాయిలో నేషనల్‌ గార్డ్‌ను మోహరించడం 1965 తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం.