Israel Hamas War: హమాస్‌ను బహిష్కరించేందుకు ఖతార్ ఆమోదం
హమాస్-ఇజ్రాయెల్ మధ్య తీవ్రతరమైన దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఖతార్ వేదికగా కాల్పుల విరమణ, బందీల విడుదలపై చర్చలు జరుపుతున్నప్పటికీ, హమాస్ నేతలు దీనికి అంగీకారం తెలపకపోవడం కలకలం రేపింది. దీంతో హమాస్ నేతలను ఖతార్ బహిష్కరించాలని అమెరికా సూచించింది. ఈ ప్రతిపాదనలకు ఖతార్ తాత్కాలికంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. బందీల విడుదలపై హమాస్ నేతలు పునరుద్ఘాటంగా తిరస్కరించడంతో, ఆ నాయకులను అమెరికా భాగస్వామిగా ఉన్న దేశాలు స్వాగతించకూడదని సూచించామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. గాజాలో గతేడాది నుండి కొనసాగుతున్న యుద్ధానికి శాంతి సాధించేందుకు కాల్పుల విరమణ ఒప్పందం కోసం అమెరికా, ఖతార్, ఈజిప్టు ప్రయత్నాలు చేస్తుండగా, రెండుసార్లు జరిగిన చర్చలు ఇప్పటివరకు ఫలితం ఇవ్వలేదు.
ఖతార్ చర్యలను ఖండించిన హమాస్ నేతలు
తాజాగా జరిగిన చర్చల్లో స్వల్పకాలిక కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించిందని సమాచారం. ఇదే సమయంలో ఖతార్‌లోని హమాస్ నాయకులను బహిష్కరించాలని అమెరికా డిమాండ్ చేయగా, ఖతార్ ఈ ప్రతిపాదనను ఆమోదించిందని, అయితే గడువు గురించి స్పష్టత లేదని అమెరికా వర్గాలు వెల్లడించాయి. కానీ ఖతార్ చర్యలను హమాస్ నేతలు ఖండించారు. గతేడాది అక్టోబరు 7న హమాస్ మెరుపుదాడితో ఇజ్రాయెల్ వణికిపోయింది. ఈ దాడుల్లో 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు, 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఇప్పటివరకు ఈ దాడుల్లో 43,000 పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.