Lebanon: లెబనాన్ విమానాల్లో వాకీ-టాకీలను నిషేధించిన ఖతార్ ఎయిర్‌వేస్
బీరుట్‌లోని రఫిక్ హరిరి అంతర్జాతీయ విమానాశ్రయం (బీఈవై) నుండి ప్రయాణించే ప్రయాణికుల కోసం పేజర్లు, వాకీ-టాకీలను తక్షణమే నిషేధిస్తున్నట్లు ఖతార్ ఎయిర్‌వేస్, ప్రకటించింది. ఈ నిర్ణయం లెబనాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి వచ్చిన ఆదేశాలను అనుసరించడమేనని ఎయిర్‌లైన్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తెలిపింది. ఇటీవల జరిగిన సైబర్ దాడుల నేపథ్యంలో, ఈ పరికరాలు విమానాల్లో తీసుకెళ్లడంపై నిషేధాన్ని అమలు చేసినట్లు లెబనీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. పశ్చిమాసియాలో, లెబనాన్‌తో పాటు సిరియాలో కూడా వేలాది పేజర్లు పేలినట్టు తెలిసింది. లెబనాన్‌లో వాకీటాకీలు కూడా పేలడంతో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 3,000 మందికి పైగా గాయపడ్డారు.
హెజ్‌బొల్లా ప్రతిఘటనా చర్యలు
ఈ ఘటనలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఈ దాడులకు ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని లెబనాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హెజ్‌బొల్లా ప్రతిఘటనా చర్యలు చేపట్టింది, ఇజ్రాయెల్ ఆయుధ స్థావరాలపై రాకెట్ల దాడులు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచాయి.