Page Loader
Sudan: సుడాన్‌లో ఆర్ఎస్ఎఫ్ దాడులు.. చిన్నారులతో సహా 300కి పైగా మృతి
సుడాన్‌లో ఆర్ఎస్ఎఫ్ దాడులు.. చిన్నారులతో సహా 300కి పైగా మృతి

Sudan: సుడాన్‌లో ఆర్ఎస్ఎఫ్ దాడులు.. చిన్నారులతో సహా 300కి పైగా మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 15, 2025
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

సూడాన్‌లో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. ఇటీవల ఆ దేశంలోని పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ (RSF)బలగాలు జరిపిన దాడుల వల్ల భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఐక్యరాజ్య సమితి మానవతా వ్యవహారాల సంస్థ(OCHA)వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దాడుల్లో 300 మందికి పైగా పౌరులు మృతిచెందారు. జామ్జామ్‌, అబూషాక్‌ శరణార్థ శిబిరాలపై గతవారం RSF బలగాలు చెలరేగిన దాడులు నిర్వహించాయి. ఇందులో 300 మంది పౌరుల మృతి జరిగినట్లు ప్రాథమిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. మృతులలో 10 మంది రిలీఫ్ ఇంటర్నేషనల్ మానవతా సంస్థకు చెందిన సిబ్బందిగా గుర్తించారు. వీరు జామ్జామ్‌ శిబిరంలోని ఆరోగ్య కేంద్రాల్లో సేవలందిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరణించిన వారిలో 23 మంది చిన్నారులుగా స్థానిక మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

Details

జామ్జామ్‌ శిబిరాన్ని విడిచి వెళ్లిన పౌరులు

ఈ దాడులను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ తీవ్రంగా ఖండించారు. శత్రుత్వానికి తక్షణమే ముగింపు పలకాలని, పౌరులు, మానవతా సిబ్బందికి సురక్షితమైన పరిస్థితులు కల్పించాలని కోరారు. దాడుల భయంతో జామ్జామ్‌ శిబిరాన్ని ఇప్పటికే 16,000 మందికి పైగా పౌరులు విడిచిపెట్టినట్లు సమాచారం. ఇక 2023 ఏప్రిల్‌లో ప్రారంభమైన SAF, RSF మధ్య సుదీర్ఘ పోరాటం ఇప్పటివరకు 29,600 మందికి పైగా ప్రాణాలు బలిగొంది. SAFఅధిపతి అబ్దుల్ ఫత్తా అల్-బుర్హాన్, ఆయన మాజీ డిప్యూటీ, RSF కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య ఏర్పడిన విభేదాలే ఈ ఘర్షణలకు నాంది పలికాయి. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు కోటి మందికి పైగా ప్రజలు సూడాన్‌ను విడిచిపెట్టినట్లు ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి.