LOADING...
Russia: ఉక్రెయిన్ డ్రోన్ దాడుల ప్రభావం.. రష్యాలో ఇంధన కొరత, చమురు ఎగుమతులకు కోత!
ఉక్రెయిన్ డ్రోన్ దాడుల ప్రభావం.. రష్యాలో ఇంధన కొరత, చమురు ఎగుమతులకు కోత!

Russia: ఉక్రెయిన్ డ్రోన్ దాడుల ప్రభావం.. రష్యాలో ఇంధన కొరత, చమురు ఎగుమతులకు కోత!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2026
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌ డ్రోన్ దాడుల కారణంగా రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని రష్యా ప్రభుత్వం తొలిసారిగా అంగీకరించింది. ఈ దాడుల ప్రభావంతో ఆక్రమిత క్రిమియాతో పాటు దక్షిణ రష్యాలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ఏర్పడినట్లు రష్యా ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 'ది మాస్కో టైమ్స్' కథనం ప్రకారం, గత కొన్ని నెలలుగా చమురు, ఇంధన కేంద్రాలపై వైమానిక దాడులు పెరగడంతో అనేక ప్రాంతాల్లో ఇంధన సరఫరాకు తాత్కాలిక అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. దేశ ఇంధన రంగం సజావుగా నడిచేలా, ఇంధన నిల్వలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

వివరాలు 

రష్యా ఇంధన రంగంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు

ఇంధన సరఫరా పూర్తిగా నియంత్రణలో ఉందని ఇంతకుముందు రష్యా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, క్రిమియాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ కొరత వార్తలు వెలుగులోకి రావడంతో పరిస్థితిపై ఆందోళనలు పెరిగాయి. రష్యా ఆర్థిక వనరులను బలహీనపరిచే లక్ష్యంతో ఉక్రెయిన్ ఈ ఏడాది చమురు శుద్ధి కేంద్రాలు, ఇంధన నిల్వ కేంద్రాలు, సరఫరా మార్గాలపై డ్రోన్ దాడులను ముమ్మరం చేసింది. ఈ దాడుల కారణంగా కొన్ని రిఫైనరీలు తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేయాల్సి రావడం లేదా ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇవి రష్యా పెట్రోల్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే కేంద్రాలుగా గుర్తించారు.

వివరాలు 

ఇంధన రవాణాకు ఆటంకాలు

రిఫైనరీలతో పాటు ఆక్రమిత క్రిమియాను రష్యాలోని రోస్తోవ్ ప్రాంతంతో కలిపే ఆర్-280 నోవోరోసియా జాతీయ రహదారిపై కూడా ఉక్రెయిన్ దాడులు చేసినట్లు సమాచారం. దీంతో ఇంధన రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో క్రిమియాతో పాటు కనీసం 14 రష్యన్ ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద ఇంధన పంపిణీపై పరిమితులు విధించారు. అయితే తీవ్రమైన కొరత వల్ల కాకుండా, ప్రజలు అధికంగా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడాన్ని అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

ఇంధన సరఫరాపై ఒత్తిడి పెరగడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఎగబాకుతున్నాయి. రష్యా గణాంక సంస్థ 'రోస్‌స్టాట్' వివరాల ప్రకారం, ఈ ఏడాది ప్రారంభం నుంచి పెట్రోల్ ధరలు సగటున 4.8 శాతం పెరిగి జూన్ 1 నాటికి లీటరుకు 67.83 రూబుల్స్‌కు చేరుకున్నాయి. డీజిల్ ధరలు కూడా ఒకే వారంలో 0.8 శాతం పెరిగి లీటరుకు సగటున 79.46 రూబుల్స్‌గా నమోదయ్యాయి. దేశంలోని 73 ప్రాంతాల్లో ఇంధన ధరలు పెరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జూలై 31 వరకు పెట్రోల్ ఎగుమతులపై రష్యా నిషేధాన్ని కొనసాగిస్తోంది. ఇంధన కొరత ప్రభావం ఇప్పుడు రష్యా చమురు ఎగుమతులపైనా పడుతోంది.

Advertisement

వివరాలు 

ఎగుమతులకు కోత.. దేశీయ రిఫైనరీలకు ఎక్కువ చమురు

'రాయిటర్స్'కథనం ప్రకారం,జూన్ నెలలో రష్యా ముడి చమురు ఎగుమతులను తగ్గించే అవకాశం ఉంది. ఎక్కువ చమురును దేశీయ రిఫైనరీలకు మళ్లించి పెట్రోల్ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. వేసవికాలంలో పెరిగే ఇంధన డిమాండ్‌ను తీర్చడంతో పాటు కొరతను తగ్గించేందుకు రిఫైనరీల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఏర్పడింది. రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ తెలిపిన వివరాల ప్రకారం,రిఫైనరీల్లో అనుకోని మరమ్మతుల కారణంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి చమురు ఉత్పత్తి తగ్గింది. మరమ్మతులు పూర్తయితే శుద్ధి సామర్థ్యం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ,ప్రస్తుతం ఉత్పత్తి తగ్గడంతో అందుబాటులో ఉన్న చమురులో ఎక్కువ భాగాన్ని దేశీయ అవసరాలకే వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విదేశాలకు చమురు ఎగుమతులు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement