వందలాది మంది ఉక్రెయిన్ దళాలను హతమార్చాం: రష్యా బలగాల ప్రకటన
భారీ స్థాయిలో ఉక్రెయిన్ దాడిని తిప్పికొట్టడంతో పాటు వందలాది మంది ఆ దేశ సైనికులను హతమార్చినట్లు సోమవారం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతమైన డొనెట్స్క్‌లోని ఐదు సెక్టార్లలో తమ బలగాలు పెద్ద ఎత్తున దాడికి పాల్పడిన ఉక్రెయిన్ సైనికులను అడ్డుకున్నట్లు రష్యా తెలిపింది. ఈ క్రమంలో వందల మంది కైవ్ అనుకూల దళాలను చంపేసినట్లు వెల్లడించింది. రష్యా చేసిన ప్రకటనపై ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ, సైన్యం స్పందించలేదని రాయిటర్స్ నివేదించింది. ఫిబ్రవరి 2022 ఆక్రమణ తర్వాత రష్యా దళాలు స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ సైనికులు రష్యాపై ఎదురుదాడికి దిగారా అనే అనుమానం వ్యక్తమవుతోంది.
ఉక్రెయిన్ సాయుధ వాహనాలను పేల్చివేసిన వీడియో విడుదల
ఉక్రెయిన్ దక్షిణ డొనెట్స్క్‌లో ఆరు మెకనైజ్డ్, రెండు ట్యాంక్ బెటాలియన్‌లతో దాడి చేసిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. జూన్ 4 ఉదయం ఈ ఘటన జరిగినట్లు చెప్పింది. శత్రువు లక్ష్యం అత్యంత దుర్బలమైనదని ఇక్రెయిన్‌ను ఉద్దేశించి రష్యా పేర్కొంది. ఒక ప్రదేశంలో ఉక్రెయిన్ సాయుధ వాహనాలను పేల్చివేసిన వీడియోను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. రష్యా దళాలు 250 మంది ఉక్రెయిన్ సైనికులను హతమార్చడంతో పాటు 16 ట్యాంకులు, మూడు పదాతిదళ పోరాట వాహనాలు, 21 సాయుధ పోరాట వాహనాలను ధ్వంసం చేశాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.