
Mystery Virus: దగ్గితే రక్తం పడే మిస్టరీ వైరస్.. తోసిపుచ్చిన రష్యా
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాలో అజ్ఞాత వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు పలు వార్తాసంస్థలు నివేదించాయి.
అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత సమస్యలు, దీర్ఘకాలిక జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్నారని సమాచారం.
ఈ వైరస్ కారణంగా దగ్గుతున్నప్పుడు రక్తస్రావం సంభవిస్తోందని కొన్ని నివేదికలు పేర్కొనడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
మార్చి 29న వచ్చిన నివేదికల ప్రకారం, రష్యాలో ఈ వైరస్ ప్రభావం తీవ్రమై, ప్రజలు అనేక వారాలపాటు జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారని వెల్లడించారు.
వైరస్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ, కొవిడ్-19 టెస్టుల్లో నెగటివ్ ఫలితాలు వచ్చాయని, ఇది కొత్త రకం వైరస్ కావచ్చని అనుమానిస్తున్నారు.
వివరాలు
తీవ్ర దగ్గుతో, రక్తస్రావంతో బాధితులు
రష్యాకు చెందిన అలెగ్జాండ్రా అనే మహిళ ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా, కొన్ని రోజుల తరువాత దగ్గుతున్నప్పుడు రక్తం కారడం ప్రారంభమైందని చెప్పినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఎన్ని మందులు వాడినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని సమాచారం.
అంతేగాక, అనేక మంది బాధితులు కూడా తీవ్ర దగ్గుతో, రక్తస్రావంతో బాధపడుతున్నట్లు వివరించారు.
సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు తమ అనుభవాలను షేర్ చేస్తూ ఇదే పరిస్థితిని తెలియజేశారు.
వివరాలు
తప్పుడు ప్రచారాలను ఖండించిన అధికారులు
అయితే, ఈ నివేదికలను రష్యా ఆరోగ్య శాఖ అధికారులు ఖండించారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనల్లో ఎలాంటి కొత్త వైరస్ వ్యాప్తి చెందుతున్న ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో వదంతులు, అపోహలు వ్యాపిస్తున్నప్పటికీ, అవన్నీ నిరాధారమైనవని తెలిపారు.
నివేదికల్లో ప్రస్తావించిన అలెగ్జాండ్రా అనే మహిళకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా, ఆమె మైకోప్లాస్మా న్యుమోనియాతో బాధపడుతున్నట్లు తేలిందని వెల్లడించారు.
ఒకవేళ కొత్త వైరస్ ఉద్భవించినా, దేశానికి తగిన సదుపాయాలు, వైద్య సాంకేతికత ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రష్యన్ అధికారులు స్పష్టం చేశారు.