Russia: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రం.. 24 గంటల్లో 1000 డ్రోన్లు ప్రయోగం
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ స్థాయిలో గగనతల దాడులకు దిగింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే దాదాపు 1,000 డ్రోన్లను ప్రయోగించడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో ఒకేసారి డ్రోన్ దాడులు జరగడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించిన వివరాల ప్రకారం,తెల్లవారుజామునే కాకుండా పట్టపగలు కూడా రష్యా దళాలు దేశంలోని 550కి పైగా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే ఉక్రెయిన్ రక్షణ దళాలు అప్రమత్తంగా స్పందించి, మొత్తం 541 డ్రోన్లను కూల్చివేశాయని ఆయన తెలిపారు. ఇక డ్రోన్ దాడులతో పాటు పలు ప్రాంతాల్లో క్షిపణి దాడులు కూడా చోటుచేసుకున్నాయి. ఈ దాడుల కారణంగా ముగ్గురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాలు
ప్రపంచ దేశాలు మాస్కోపై కఠిన ఆంక్షలు విధించాలి: జెలెన్‌స్కీ
ఇవానో-ఫ్రాంకివ్స్క్ ప్రాంతంలో జరిగిన దాడులు హృదయ విదారకంగా మారాయి. అక్కడి ఒక ప్రసూతి ఆస్పత్రి సమీపంలో జరిగిన దాడిలో ఓ సైనికుడు,అతని చిన్న కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. కొన్ని రోజుల క్రితమే పుట్టిన తన శిశువును చూసేందుకు భార్యను కలవడానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ దాడుల వల్ల వందల సంఖ్యలో నివాస గృహాలు,ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నాయి. అయితే మొత్తం నష్టం ఎంత మేరకు జరిగిందో ఇంకా పూర్తిగా అంచనా వేయాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. రష్యా దాడుల తీవ్రత పెరుగుతుండటం చూస్తే, యుద్ధాన్ని ముగించాలనే ఉద్దేశం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు లేదని జెలెన్‌స్కీ విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు మాస్కోపై కఠిన ఆంక్షలు విధించాలని ఆయన కోరారు.