
Trump-Putin Meeting: రష్యా చమురు వివాదం.. భారత్‌పై అదనపు సుంకాల విషయంలో ట్రంప్ వెనకడుగు!
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా చమురును కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై ఇటీవల అదనపు సుంకాలు (Trump Tariffs) విధిస్తానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ అదనపు టారిఫ్‌ల అంశంపై పునరాలోచన చేస్తానని ఆయన తాజాగా వెల్లడించారు. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)తో కీలక భేటీ (Trump-Putin Meeting) ముగిసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న సుదీర్ఘ యుద్ధం ముగింపునే లక్ష్యంగా ట్రంప్-పుతిన్ భేటీ అలాస్కాలో రెండున్నర గంటల పాటు సాగింది. అయితే ఈ సమావేశంలో యుద్ధం నిలిపివేతపై ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అయినప్పటికీ సమావేశం సానుకూలంగా సాగిందని ట్రంప్ తెలిపారు.
Details
టారిఫ్ ల తక్షణ నిర్ణయం తీసుకోవాలి
అనంతరం మీడియాతో మాట్లాడుతూ సుంకాల అంశంపై స్పందించిన ఆయన, 'ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై టారిఫ్‌ల గురించి తక్షణ నిర్ణయం తీసుకోవాలని నేను అనుకోవడం లేదు. రెండు, మూడు వారాల్లో దీనిపై పునరాలోచిస్తా. ప్రస్తుతానికి సమావేశం సాఫీగా ముగిసిందని పేర్కొన్నారు. అసలు సమావేశానికి ముందు కూడా ట్రంప్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. భారత్‌ను ఉద్దేశిస్తూ రష్యా తన చమురు క్లయింట్‌ను కోల్పోయిందని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతానికి భారత్, చైనా లాంటి దేశాలపై అదనపు సుంకాలు విధించే ఉద్దేశం లేదని ఆయన స్పష్టంచేశారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోందన్న కారణంతో భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.
Details
ఆగస్టు 27 నుంచి అమల్లోకి
ఈ కొత్త టారిఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరికలు జారీ చేశారు. పుతిన్‌తో సమావేశం సవ్యంగా సాగకపోతే భారత్‌పై సుంకాల రేటు మరింత పెరగవచ్చని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా ఆపకపోతే ఆ దేశంపై 100 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ గతంలో హెచ్చరించారు. ఇలాంటి పరిణామాల మధ్య పుతిన్‌తో భేటీ అనంతరం ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం మాస్కో నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై అదనపు సుంకాలు లేకపోవచ్చన్న సంకేతాలు ట్రంప్ ఇచ్చినట్లయింది.