Russia On Trade Deal: భారత్ అమెరికా ట్రేడ్ డీల్‌పై స్పందించిన రష్యా..
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-అమెరికాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది. గత కొద్ది రోజులుగా ఇరు దేశాల మధ్య కొనసాగిన ఉద్రిక్త పరిస్థితులకు దీనితో ముగింపు పలికినట్టైంది. పరస్పర వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలన్న లక్ష్యంతో రెండు దేశాలు ఈ ఒప్పందానికి అంగీకరించాయి. ఈ నేపథ్యంలో తాజాగా రష్యా స్పందించింది. చమురు కొనుగోళ్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేస్తోందన్న సూచనలు ఇప్పటివరకు తమకు లభించలేదని క్రెమ్లిన్ స్పష్టం చేసింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు నిలిపేస్తున్నట్లు భారత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదని పేర్కొంది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా వెల్లడించింది.
వివరాలు
ఆంక్షలు లేని దేశాల నుంచే భారత్ చమురు కొనుగోలు
కొన్ని నెలలుగా నిలిచిపోయిన భారత్-అమెరికాల వాణిజ్య చర్చలు చివరకు ఫలప్రదంగా ముగిశాయి. ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. భారత వ్యవసాయ రంగానికి అమెరికా ప్రవేశంపై నెలకొన్న విభేదాలే ఈ ప్రతిష్టంభనకు కారణంగా మారాయి. అయితే చివరికి అమెరికా, భారత్ సూచనలకు అనుగుణంగా ముందడుగు వేసినట్టు సమాచారం. మరోవైపు, ఆంక్షలు లేని దేశాల నుంచే భారత్ చమురు కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.