Loading...
Russia: ఉక్రెయిన్‌ యుద్ధంలో అమెరికన్లకు రష్యా ఎర.. భారీగా నగదు ఆఫర్!
ఉక్రెయిన్‌ యుద్ధంలో అమెరికన్లకు రష్యా ఎర.. భారీగా నగదు ఆఫర్!

Russia: ఉక్రెయిన్‌ యుద్ధంలో అమెరికన్లకు రష్యా ఎర.. భారీగా నగదు ఆఫర్!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 29, 2026
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నాలుగేళ్లకుపైగా కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఇరుదేశాల మధ్య దాడులు మరింత తీవ్రతరం అయ్యాయి. రష్యా తన సైన్యంలోకి స్వదేశీయులతో పాటు ఇతర దేశాలకు చెందిన వారినీ నియమించుకుంటున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ జాబితాలో అమెరికన్లు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. సామాజిక మాధ్యమాల ద్వారా అమెరికా పౌరులను రష్యా సైన్యంలో చేరేలా ఆకర్షిస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది. సైన్యంలో చేరినందుకు 26,000 డాలర్ల వరకు సైనింగ్ బోనస్‌తో పాటు నెలకు 2,000 డాలర్ల జీతం ఇస్తామని రష్యా తరఫున కొందరు ఏజెంట్లు ప్రచారం చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు కనీసం 18 మంది అమెరికా జాతీయులను రష్యా దళాల్లోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

వివరాలు 

సోషల్ మీడియాలో ప్రచారం

వీరిలో కొందరు గతంలో అమెరికా సైన్యంలో పనిచేసిన మాజీ సైనికులు ఉన్నట్లు పేర్కొంది.

టిక్‌టాక్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ఈ ఆఫర్లను ప్రచారం చేస్తున్నట్లు సమాచారం.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారితో పాటు అమెరికా వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఉక్రెయిన్ నిఘా వర్గాలు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది.

రష్యా సైన్యంలో చేరిన విదేశీయులను యుద్ధరంగంలోని ముందువరుసలోకి పంపుతున్నట్లు ఉక్రెయిన్ నిఘా వర్గాలు ఆరోపించాయి.

దీంతో కొంతమంది అమెరికన్లు రష్యా సైన్యంలో చేరిన కొద్దికాలానికే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆ కథనం తెలిపింది.

వివరాలు 

రష్యాకు మరో 10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు?

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరఫున ఉత్తరకొరియా సైనికులు కూడా పోరాడుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే వేలాది మంది ఉత్తరకొరియా సైనికులను రష్యాకు పంపినట్లు గతంలో వార్తలు వచ్చాయి.

తాజాగా మరో 10వేల మంది సైనికులను రష్యాకు పంపేందుకు కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు.

ఇలాంటి ప్రకటనలను జెలెన్‌స్కీ గతంలోనూ చేశారు.మొత్తం 50వేల మంది వరకు ఉత్తరకొరియా సైనికులను రష్యాకు పంపే అవకాశం ఉందని ఆయన గతంలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా..రష్యా దళాల తరఫున పోరాడుతున్న 135దేశాలకు చెందిన సుమారు 29 వేల మందిని గుర్తించినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.

అయితే వాస్తవ సంఖ్య దీనికంటే ఎక్కువగా ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT