Russia: రష్యాలో తగ్గుతున్న పాఠశాలలు.. గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
2000 సంవత్సరం నుంచి రష్యాలో పాఠశాలల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. హయ్యర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గణాంకాలను ఉటంకిస్తూ 'యూరోన్యూస్' ఈ వివరాలను వెల్లడించింది. 2000లో రష్యాలో సుమారు 68,800 మాధ్యమిక పాఠశాలలు ఉండగా.. 2026 నాటికి వాటి సంఖ్య 38,000కు దిగువకు చేరింది. అంటే దాదాపు 45 శాతం పాఠశాలలు మూతపడ్డాయి. అయితే పాఠశాలల సంఖ్య భారీగా తగ్గినా.. విద్యార్థుల సంఖ్య మాత్రం అంతగా తగ్గలేదు. 2000లో రష్యాలో పాఠశాల వయసు పిల్లలు సుమారు 2.05 కోట్ల మంది ఉండగా.. 2026 నాటికి ఆ సంఖ్య 1.77 కోట్లకు తగ్గింది. అంటే విద్యార్థుల సంఖ్యలో 13.5 శాతం మాత్రమే తగ్గుదల నమోదైంది.
వివరాలు
గ్రామీణ ప్రాంతాల్లోనే భారీగా పాఠశాలల మూసివేత
ప్రధాన నగరాల వెలుపల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల మూసివేత మరింత ఎక్కువగా జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు 45 వేలకు పైగా ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు 21వేలకు పడిపోయింది. అంటే సగానికి పైగా గ్రామీణ పాఠశాలలు కనుమరుగయ్యాయి.
నగర ప్రాంతాల్లోనూ పాఠశాలల సంఖ్య తగ్గింది.అయితే గ్రామాలతో పోలిస్తే ఈ తగ్గుదల తక్కువగా ఉంది.
2000లో పట్టణ ప్రాంతాల్లో సుమారు 22,700పాఠశాలలు ఉండగా.. 2026 నాటికి వాటి సంఖ్య దాదాపు 16,300కు చేరింది.
మరోవైపు ఒక్కో పాఠశాలలో చదివే విద్యార్థుల సగటు సంఖ్య పెరిగింది.
సుమారు 15ఏళ్ల క్రితం ఒక్కో పాఠశాలలో సగటున 300మంది విద్యార్థులు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 470కి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
వివరాలు
విద్యా 'ఆప్టిమైజేషన్'తో చిన్న పాఠశాలలకు కష్టాలు
ఈ మార్పులకు 2001లో ప్రారంభమైన విద్యా వ్యవస్థ 'ఆప్టిమైజేషన్' కార్యక్రమం కూడా ఒక కారణంగా పేర్కొంటున్నారు.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు కేటాయించే విధానం అమల్లోకి రావడంతో తక్కువ మంది విద్యార్థులు ఉన్న చిన్న పాఠశాలలకు నిర్వహణ కష్టంగా మారింది.
దీంతో అనేక చిన్న పాఠశాలలను పెద్ద పాఠశాలల్లో విలీనం చేయడం లేదా పూర్తిగా మూసివేయడం జరిగింది.
2010 నాటికే రష్యాలోని దాదాపు 26 శాతం పాఠశాలలు మూతపడ్డాయి.
ఆ తర్వాతి దశాబ్దంలో మరో 10 వేల పాఠశాలలు మూసివేయగా.. 2020ల ప్రారంభం నుంచి ఇప్పటివరకు మరో 2,300 పాఠశాలలు మూతపడ్డాయి.
వివరాలు
గ్రామీణ ప్రాంతాలపై పాఠశాలల మూసివేత ప్రభావం
పాఠశాలల విలీనాన్ని కొందరు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వ్యతిరేకించారు.
పెద్ద పాఠశాలలను నిర్వహించడం కష్టంగా మారడంతో పాటు తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల మూసివేత అక్కడి జనాభాపైనా ప్రభావం చూపుతుందనే చర్చ మొదలైంది.
2026లో రష్యాకు చెందిన 'నోజ్' మ్యాగజైన్ ప్రచురించిన ఓ అధ్యయనం.. గ్రామీణ పాఠశాలల మూసివేతకు జనాభా తగ్గుదలకు సంబంధం ఉందని పేర్కొంది.
స్థానికంగా పిల్లలకు చదువు అందుబాటులో లేకపోతే ఆ కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉందని ఆ అధ్యయనం తెలిపింది.
వివరాలు
రష్యా పాఠశాలల్లో మారిన పాఠ్యాంశాలు.. దేశభక్తి నుంచి ఉక్రెయిన్ యుద్ధం వరకు
మరోవైపు రష్యా విద్యా వ్యవస్థలో బోధించే అంశాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి.
2022 సెప్టెంబరు నుంచి రష్యా పాఠశాలల్లో ప్రతి వారం 'కన్వర్సేషన్స్ అబౌట్ వాట్ మ్యాటర్స్' పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
విద్యా మంత్రిత్వ శాఖ అందించే పాఠ్య ప్రణాళికల ఆధారంగా ఈ తరగతులు జరుగుతున్నాయి.
సంప్రదాయ విలువలు, దేశభక్తి, దేశానికి సేవ, ప్రపంచంలో రష్యా పాత్ర వంటి అంశాలను ఇందులో బోధిస్తున్నారు.
ఉక్రెయిన్‌లో యుద్ధం కూడా పాఠ్యాంశాల్లో చోటు చేసుకుంది. అధికారిక విద్యా సామగ్రిలో రష్యా ఉపయోగించే 'ప్రత్యేక సైనిక చర్య' అనే పదాన్ని వినియోగిస్తున్నారు.
2023 నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన ఏకీకృత చరిత్ర పాఠ్యపుస్తకాల్లోనూ ఇటీవలి రష్యా చరిత్ర, ఉక్రెయిన్‌తో వివాదంపై మాస్కో వైఖరికి అనుగుణంగా అంశాలను పొందుపరిచారు.
వివరాలు
పాఠశాలల తగ్గుదలకు రాజకీయాలే కారణం కాదు..
అనంతరం ఈ పుస్తకాల్లో మరిన్ని మార్పులు చేసి.. యుద్ధం, ఇటీవలి రష్యా-అమెరికా సంబంధాలకు సంబంధించిన అంశాలను చేర్చారు.
అయితే రష్యాలో పాఠశాలల సంఖ్య తగ్గడానికి ప్రస్తుత రాజకీయ పరిస్థితులే కారణం కాదని గణాంకాలు సూచిస్తున్నాయి.
జనాభా మార్పులు, పాఠశాలలకు నిధులు కేటాయించే విధానం, చాలా కాలంగా కొనసాగుతున్న పాఠశాలల విలీన ప్రక్రియ వంటి అనేక అంశాలు దీనికి కారణమయ్యాయి.
ఇదే సమయంలో ప్రైవేటు పాఠశాలల సంఖ్య మాత్రం పెరిగింది.
2000లో 635గా ఉన్న ప్రైవేటు పాఠశాలలు 2026 నాటికి 982కు చేరాయి. అయినప్పటికీ దేశంలోని మొత్తం పాఠశాలల్లో వాటి వాటా సుమారు 2.5 శాతమే.