Page Loader
Hacking: కొత్త పంథాను అనుసరిస్తున్న రష్యా సైబర్ నేరగాళ్లు.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులుగా నటిస్తూ హ్యాకింగ్‌ 

Hacking: కొత్త పంథాను అనుసరిస్తున్న రష్యా సైబర్ నేరగాళ్లు.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులుగా నటిస్తూ హ్యాకింగ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 24, 2025
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా సైబర్ నేరగాళ్లు (Russian Cybercriminals) కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారని వెల్లడైంది. టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) ఉద్యోగులుగా నటిస్తూ హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారని బ్రిటిష్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ సోఫోస్‌ వెల్లడించిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ప్రారంభంలో, స్కామర్లు లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తి కంప్యూటర్‌కు పెద్ద సంఖ్యలో స్పామ్‌ సందేశాలు పంపుతారు. ఆ సందేశాల వల్ల యూజర్ నానా అవస్థలు పడే సమయంలో, హ్యాకర్లు ఐటీ సపోర్ట్‌ ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటారు. తాము ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి, ఆ కంప్యూటర్‌కు యాక్సెస్ పొందగానే ర్యాన్సమ్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి, సమాచారాన్ని దొంగిలిస్తారు. ఈ ప్రక్రియ అంతా రిమోట్‌గానే జరుగుతుంది.

వివరాలు 

యూకేలోని సంస్థలే లక్ష్యంగా..

పలు సంస్థలు నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్‌ మరియు సెక్యూరిటీ సేవల కోసం మేనేజ్డ్‌ సర్వీస్ ప్రొవైడర్స్‌పై ఆధారపడుతుండటంతో, హెల్ప్‌ డెస్క్‌ మేనేజర్ పేరుతో స్కామర్లు నమ్మబలుకుతున్నారని సోఫోస్‌ తెలిపింది. ''మైక్రోసాఫ్ట్ 365ని ఉపయోగించే సంస్థలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని మేము సూచిస్తున్నాం,'' అని పేర్కొంది. రష్యాకు చెందిన ఫిన్‌7, స్టార్మ్-1811 వంటి సైబర్ ముఠాలు ఈ తరహా కార్యకలాపాలు చేస్తూ, ముఖ్యంగా యూకేలోని సంస్థలను లక్ష్యంగా చేసుకున్నాయని హెచ్చరించింది. ఇప్పటి వరకు ఇలాంటి 15 ఘటనలు నమోదయ్యాయని కూడా వివరించింది.