రష్యా: లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్ కూలిపోవడంపై శాస్త్రవేత్త మనస్తాపం.. ఆస్పత్రిలో చేరిక
లూనా 25 స్పేస్‌క్రాఫ్ట్ వైఫల్యంతో రష్యాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఆస్పత్రి పాలయ్యారు. లూనా 25 మిషన్ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన ప్రముఖ భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త మిఖాయిల్ మారోవ్ మనస్థాపంతో అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. రష్యాకు చెందిన లూనా-25 మూన్ మిషన్ (MOON MISSION) క్రాష్ అయిన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలం మీద రోవర్ ల్యాండ్ అయ్యే ముందు విన్యాసాల సమయంలో ల్యాండర్ కుప్పకూలిపోయినట్లు రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ, రోస్కోస్మోస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రష్యన్ దేశానికి చంద్రుడిపై పాదం మోపేందుకు గల ఆశలు గల్లంతయ్యాయి.
చంద్రుడి వద్ద రష్యన్ ల్యాండర్‌ను చూడటమే నా చివరి ఆశ : మారోవ్
రష్యా సోవియట్ యూనియన్(యూఎస్ఎస్ఆర్) అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి కొన్ని దశాబ్ధాలుగా శాస్త్రవేత్త మిఖాయిల్ మారోవ్ సేవలందించారు. లూనా 25 మిషన్ ల్యాండ్ కాకపోవడం బాధాకరమని మారోవ్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రుడి వద్ద రష్యన్ ల్యాండర్ ను చూడాలనేదే చివరి ఆశని ఆయన అంతకుముందే చెప్పారు. మిషన్ వైఫల్యం వెనుక ఉన్న కారణాలను విశ్లేషించనున్నట్లు మారోవ్ తెలిపారు. ఈ మేరకు ప్రయోగాన్ని పునః పరిశీలించాలని ఆశిస్తున్నానన్నారు. గడిచిన 47 సంవత్సరాల్లో చంద్రుడిపై రష్యా ప్రయోగించిన మొదటి మిషన్ ఇదే కావడం గమనార్హం. ఆగస్ట్ 14, 1976న అంతరిక్షంలోకి బయలుదేరిన లూనా 24, స్పేస్ క్రాఫ్ట్ చివరి రష్యా చంద్ర మిషన్. డిసెంబరు 1991లో సోవియట్ యూనియన్ రద్దైంది.