ప్రపంచ అంతరిక్షంలో కీలక పరిణామం.. గంటల తేడాతో చంద్రుడి మీదకు రష్యా, భారత్ మిషన్లు
ప్రపంచ అంతరిక్ష రంగంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రష్యాకు చెందిన లూనా-25, ఇండియాకు చెందిన చంద్రయాన్-3 కొన్ని గంటల తేడాతో దాదాపు ఒకే సమయంలో ల్యాండింగ్ కానున్నాయి. చందమామ వద్దకు భారత్ ప్రయోగించిన చంద్రయాన్- 3 తర్వాత, రష్యా తన లూనా మిషన్ అయిన లూనా -25ను అదే జాబిల్లి వద్దకు ప్రయోగించింది. 47 ఏళ్ల తర్వాత చంద్రుడి మీదకు రష్యా ప్రయోగం చేసింది. మాస్కోకు తూర్పున సుమారు 5,500 కి.మీ దూరంలోని అముర్ ఒబ్లాస్ట్‌లోని వోస్టోనీ కాస్మోడ్రోమ్ నుంచి లూనా-25ను నింగిలోకి పంపించింది. జులై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 కంటే లూనా 25ని రష్యా లేట్ గానే ప్రయోగించింది. అయినప్పటికీ చంద్రయాన్ కంటే ముందే జాబిల్లిపై అడుగుపెట్టనుంది.
ఆగస్ట్ 21 లేదా 22 కి చంద్రుడి వద్దకు లూనా 25
ఆగస్ట్ 11 శుక్రవారం తెల్లవారు జామున 4.40 గంటలకు రష్యాలోని వోస్టోని కాస్మోడ్రోమ్ నుంచి లూనా-25 ల్యాండర్ ను ప్రయోగించారు.ఈ క్రమంలోనే లూనా-25 ఆగస్ట్ 21 లేదా 22న చంద్రుడి ఉపరితలానికి చేరుకుంటుందని అంచనా. మరోవైపు చంద్రుడి చుట్టే దాదాపు 7 నుంచి 10 రోజుల పాటు రష్యా ల్యాండర్ పయనిస్తుందని భావిస్తున్నారు.అయితే జులై 14న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 దాదాపు నెల రోజుల తర్వాత ఆగస్ట్ 23న చంద్రుడిపై అడుగుపెట్టనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను దించాలనే లక్ష్యంతో సోయుజ్ 2.1 బి రాకెట్‌లో లూనా-25(లూనా గ్లోబ్ మిషన్)ను చంద్రుడిపైకి ప్రయోగించినట్లు రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ ప్రకటించింది. 5 రోజుల పాటు అది జాబిల్లి వైపు కదులుతుందని వెల్లడించింది.
అదే జరిగితే మొదటి దేశంగా రష్యా ఆవిర్భావం
చంద్రుడి వద్ద ఈ ధ్రువంపై నీరు చేరే అవకాశం ఉందని రష్యా అంటోంది. మరోవైపు దక్షిణ ధ్రువంలో నీరు ఉందని 2018లోనే నాసా చెప్పేసింది. రోవర్, ల్యాండర్లను కలిగి ఉన్న లూనా-25 ల్యాండర్ బరువు 800 కిలోలు. ల్యాండర్‌లోని ప్రత్యేక పరికరంతో ఆరు అంగుళాల మేర ఉపరితలాన్ని తవ్వి మట్టి నమూనాలను సేకరిస్తుంది. దీంతో ఘనీభవించిన నీటి ఆవిష్కరణ జరిగేందుకు అవకాశం ఉంది. భవిష్యత్ లో మానవులు చందమామపై స్థావరం ఏర్పరుచుకుంటే నీటి సమస్య ఉండకూడదని రష్యా ధ్యేయంగా పెట్టుకుంది. ఇప్పటి దాకా జరిగిన చందమామ మిషన్‌లన్నీ జాబిల్లి భూ మధ్యరేఖకే చేరుకున్నాయి. లూనా-25 సక్సెస్ అయితే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ఏకైక దేశంగా రష్యా నిలవనుంది.