సొంత నగరంపైనే రష్యా యుద్ధవిమానం దాడి; డ్యామిట్ ఎలా జరిగింది?
ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు వెళ్తున్న రష్యా యుద్ధవిమానం అనుకోకుండా సొంత నగరంపై దాడి చేసింది. దీంతో భారీ పేలుళ్లు సంభవించాయి. భవనాలు దెబ్బతిన్నాయి. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ధృవీకరించింది. రష్యాకు చెందిన బెల్గోరోడ్ నగరం ఉక్రెయిన్ సరిహద్దులో ఉంటుంది. సుఖోయ్ సు-34 వైమానిక దళ విమానం ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న బెల్గోరోడ్ నగరం మీదుగా ఎగురుతున్నప్పుడు మందుగుండు సామగ్రిని అనుకోకుండా విడుదల చేసిందని వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం తెలిపింది. దీంతో అది బెల్గోరోడ్ నగరంలో పడినట్లు పేర్కొంది. ఈ పేలుడులో ఇద్దరు మహిళలు గాయపడ్డారని బెల్గోరోడ్ ప్రాంతీయ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్‌కోవ్ తెలిపారు.
బెల్గోరోడ్ నగరంలో అత్యవసర పరిస్థితి
పేలుళ్లు సంభవించి భవనాలు దెబ్బతిన్నాయని, నగరంలోని ప్రధాన వీధిలో20 మీటర్ల పొడవున్న బిలం ఏర్పడిందని వ్యాచెస్లావ్ గ్లాడ్‌కోవ్ వెల్లడించారు. అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన ఆయుధంపై రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ ఘటనపై రష్యా దర్యాప్తు ప్రారంభించిందని స్థానిక వార్త సంస్థలు నివేదించాయి. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇంధనం, మందుగుండు సామాగ్రి పేలుళ్లతో దక్షిణ రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతం నిత్యం అల్లాడిపోతోంది.