Saudi Arabia: 'తొందరపడొద్దు'.. ఇరాన్‌పై దాడికి ముందు ట్రంప్‌కు సౌదీ కీలక విజ్ఞప్తి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత ఇరాన్‌పై అమెరికా మళ్లీ సైనిక చర్యకు దిగవచ్చనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా అప్రమత్తమైంది. ఇరాన్‌పై దాడి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, సైనిక చర్యకు బదులుగా దౌత్యపరమైన చర్చలకు మరికొంత సమయం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరింది. ఈ మేరకు ట్రంప్ యంత్రాంగానికి సౌదీ అధికారులు విజ్ఞప్తి చేసినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి.
వివరాలు
సౌదీకి భారీనష్టం వాటిల్లే ప్రమాదం
అమెరికా సైనిక చర్యకు ఆదేశించే ముందు సంయమనం పాటించాలని సౌదీ ఉన్నతాధికారులు ట్రంప్ యంత్రాంగంలోని కీలక వ్యక్తులను కోరినట్లు సమాచారం.
అమెరికా ఇరాన్‌పై దాడి చేస్తే.. ఆ దేశానికి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ), సైన్యం ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని రియాద్ ఆందోళన చెందుతోంది.
ముఖ్యంగా సౌదీలోని నీటి సరఫరా వ్యవస్థలు,విద్యుత్ మౌలిక సదుపాయాలు,చమురు,ఇంధన రంగాలకు చెందిన కీలక కేంద్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవచ్చని భావిస్తోంది.
అలాంటి పరిస్థితి ఎదురైతే సౌదీకి భారీనష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆ దేశం అంచనా వేస్తోంది.
కొద్ది రోజుల క్రితం మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంలో భాగస్వాములైన టర్కీ,సౌదీ అరేబియా, పాకిస్థాన్ దేశాలకు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఇరాన్లో పర్యటించింది.
వివరాలు
ఇరాన్లో సౌదీ, టర్కీ, పాక్ ప్రతినిధుల పర్యటన
ఈ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయ్తో సమావేశమైంది.
ఈ బృందంలో సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ కూడా పాల్గొన్నారు.
ఈ భేటీల సందర్భంగా ఇరాన్‌కు సౌదీ అరేబియా ఓ కీలక విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
భవిష్యత్తులో ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ సైనిక ఘర్షణలు మొదలైతే.. తమ దేశంలోని కీలక చమురు, గ్యాస్ కేంద్రాలపై దాడులు చేయవద్దని కోరినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
అయితే, సౌదీ చేసిన ఈ విజ్ఞప్తికి సంబంధించి ఎలాంటి హామీ ఇచ్చేందుకు ఇరాన్ అంగీకరించలేదని తెలుస్తోంది.
వివరాలు
గతంలోనూ సౌదీపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు
మార్చిలో ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఆపరేషన్ రోరింగ్ లయన్,ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేర్లతో సైనిక చర్యలు చేపట్టిన సమయంలో ఇరాన్ సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది.
అయితే,ఒక దశలో రియాద్ నుంచి వచ్చిన హెచ్చరికలతో ఇరాన్ తన దాడుల తీవ్రతను తగ్గించింది.
ఆ తర్వాత పూర్తిగా నిలిపివేసింది.దాడులు కొనసాగిస్తే తమ హద్దులు దాటినట్లేనని సౌదీ అరేబియా అప్పట్లో ఇరాన్‌ను హెచ్చరించింది.
ఇదే పరిస్థితి కొనసాగితే ఇరాన్‌పై తాము కూడా సైనిక దాడులు చేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని సౌదీ ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.