Page Loader
Pakistan: 5,000 మందికి పైగా పాకిస్తానీ యాచకులను బహిష్కరించిన సౌదీ అరేబియా 
5,000 మందికి పైగా పాకిస్తానీ యాచకులను బహిష్కరించిన సౌదీ అరేబియా

Pakistan: 5,000 మందికి పైగా పాకిస్తానీ యాచకులను బహిష్కరించిన సౌదీ అరేబియా 

వ్రాసిన వారు Sirish Praharaju
May 16, 2025
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

''మేము ఏ మిత్ర దేశానికైనా వెళ్లినా..అడుక్కోవడానికే వచ్చామన్న భావన వార ఉంటోంది''ఇది ప్రస్తుత పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ దాదాపు మూడేళ్ల క్రితం చేసిన వ్యాఖ్య. ఆయన ఈమాటలు ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ,ప్రస్తుతం ఆమాటలు పాక్‌కు చెడుపేరు వచ్చేలా చేస్తున్నాయి. పాకిస్థాన్‌ ఇప్పుడు తన మిత్ర దేశాలకు బిచ్చగాళ్లను ఎగుమతి చేసే దేశంగా,ఒక యాచకుల దేశంగా అపకీర్తిని మూటగట్టుకుంది. తాజాగా సౌదీ అరేబియా ప్రభుత్వం పాకిస్థాన్‌కు చెందిన 5,033 మంది బిచ్చగాళ్లను బలవంతంగా వారి స్వదేశానికి పంపించగా,మరో 369 మందిని ఇతర దేశాలకు అప్పగించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ ఇంటీరియర్‌ మంత్రి మొహసిన్‌ నక్వీ ఇటీవల వారి దేశం పార్లమెంట్‌ అయిన నేషనల్‌ అసెంబ్లీలో వెల్లడించినట్లు డాన్‌ పత్రిక తెలిపింది.

వివరాలు 

సంపన్న ప్రావిన్స్‌ల నుంచే అధిక సంఖ్యలో బిచ్చగాళ్ళు..

2024 జనవరి నుంచి ఇప్పటివరకు మిత్రదేశాల నుండి తరిమివేసిన పాక్‌ బిచ్చగాళ్ల సంఖ్య మొత్తం 5,402కి చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీరిని వెనక్కి పంపిన దేశాల్లో సౌదీ అరేబియా, ఇరాక్‌, మలేసియా, ఒమన్‌, ఖతార్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఉన్నాయి. ఈ మొత్తంలో సింధ్‌ ప్రావిన్స్‌ నుంచి - 2,795 మంది, పంజాబ్‌ రాష్ట్రం నుంచి - 1,437 మంది, ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా (కేపీ) నుంచి - 1,002 మంది, బలోచిస్థాన్‌ నుంచి - 125 మంది, పీవోకే (పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌) నుంచి - 33 మంది, ఇస్లామాబాద్‌ నుంచి - 10 మంది ఉన్నారు.

వివరాలు 

వీసా సమస్యలు.. 

పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్‌ ఏప్రిల్‌ 19న సియాల్‌కోట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో యాచకుల సమస్య తీవ్రమవుతోందన్నారు. ఈ కారణంగా పాకిస్థాన్‌కు ఇతర దేశాలు వీసాలు జారీ చేయడంలో వెనుకంజ వేస్తున్నాయన్నారు. దేశంలో సుమారు 2 కోట్ల మంది యాచకులు ఉన్నారని వెల్లడించారు. వారు నెలకు కలిపి సుమారు 4,200 కోట్ల పాకిస్తానీ రూపాయలు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. సియాల్‌కోట్‌లో ఈ యాచకులను రెండుసార్లు తొలగించినా, మళ్లీ తిరిగి వచ్చారన్నారు.

వివరాలు 

విదేశాల్లో పాక్‌ బిచ్చగాళ్ల భూతం: 

2023లో, పాకిస్థాన్‌ సెనేట్‌ ప్యానెల్‌ ఎదుట నాటి ఓవర్సీస్‌ మినిస్ట్రీ సెక్రటరీ జుల్ఫీకర్‌ హైదర్‌ మాట్లాడారు. విదేశాల్లో అరెస్టు అవుతున్న 90 శాతం బిచ్చగాళ్లు పాక్‌ పౌరులే అని వెల్లడించారు. చాలా మంది యాత్రికుల వీసాలను తీసుకొని సౌదీ, ఇరాన్‌, ఇరాక్‌ వంటి దేశాలకు వెళ్లి అక్కడ అడుక్కుంటున్నారని తెలిపారు. అంతేకాదు, ఇప్పుడు జపాన్‌ కూడా పాక్‌ యాచకులకు కొత్త గమ్యస్థానంగా మారుతోందని పేర్కొన్నారు.